ఒకే ఇంట్లో 38 ఓట్లు.. హైదరాబాద్ లోని ఒక మున్సిపాలిటీ సిత్రం

Update: 2019-12-27 04:23 GMT
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మున్సిపోల్స్ హడావుడి మొదలైంది. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ..  బీసీ.. ఎస్సీ.. ఎస్టీ ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో సిద్ధం కాని సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు కూడా ఇంకా తేలకపోవటంతో.. తుది జాబితా విడుదల కోసం క్యాలెండర్లో డేట్ల వంక ఆశగా చూస్తున్న పరిస్థితి.

ఇలాంటివేళలోనూ చిత్ర.. విచిత్రమైన విషయాలు బయటకువస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి ఉదంతమే ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

ఇక్కడి 18వ డివిజన్ లో ఓటర్ల జాబితాలు.. ఓటర్ల నమోదులో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలు తీవ్రంగా ఉన్నాయని చెబుతున్నారు. ఖాళీ స్థలాన్ని చిరునామాగా చూపించి వందల ఓట్లు నమోదు కావటం ఒక ఎత్తు అయితే.. ఒకే ఇంట్లో 38 ఓట్లు నమోదు కావటం మరో ఎత్తు.

చివరకు విషయం ఎంతవరకూ వెళ్లిందంటే.. ఒక యజమాని తన చిరునామాతో 32 బోగస్ ఓట్లు ఉన్నాయంటూ సంబంధిత తహసీల్దార్ కు కంప్లైంట్ చేసే వరకూ వెళ్లింది. జనవరి మూడో వారంలో పోలింగ్ జరగనున్న వేళ.. ఈ తరహా ఉదంతాలు తెర మీదకు రావటంతో అధికారులు కిందామీదా పడుతున్నారు.

బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో 18వ డివిజన్ లోని సాయి నగర్ లోని 8-22 ఇంటి నెంబరులో 38 ఓట్లు.. 8-21 ఇంటి నెంబరులో 32 ఓట్లు.. 8-91 ఇంటి నెంబరులో 30ఓట్లు ఉన్నట్లుగా తేలింది. ఇక.. ఇదే డివిజన్ లోని బాలాజీ నగర్ ఓపెన్ ప్లాట్ కు 7-58 ఇంటి నెంబరు తీసుకున్నారు. షాకింగ్ నిజం ఏమంటే.. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేదు. అయినప్పటికీ వందకు పైగా ఓట్లు నమోదైనట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే అయోధ్యనగర్ లోని వ్యవహారం మరింత దారుణంగా చెప్పాలి. ఇక్కడి ఓపెన్ ప్లాట్ కు ఇంటి నెంబరు తీసుకొని వంద వరకూ ఓట్లు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఓటర్ల జాబితా ఇంత లోపభూయిష్టంగా తయారు చేస్తే.. ఎన్నికల నాటికి మరెన్ని విషయాలు తెర మీదకు వచ్చి రచ్చ రచ్చగా మారతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అక్రమ పద్దతిలో ఓట్లు నమోదైన విషయం తమ వరకూ వస్తే.. సంబంధిత అధికారులకు పంపి పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నా.. అసలు నమోదు చేసేటప్పుడే ఎలా చేస్తారన్న ప్రాధమిక ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి.



Tags:    

Similar News