పాక్ లోని ప్రేయసి కోసం భారత్ బోర్డర్ దాటే సాహసం చేసిన యువకుడు

Update: 2020-07-18 07:50 GMT
ప్రేమలో ఉన్నోడు దేనికి భయపడడు. దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చి భద్రతా దళాలకు షాకింగ్ గా మారింది. ఇంతకీ ఈ వ్యవహారం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన సిద్దిఖీ మొహమ్మద్ జిషాన్ అనే కుర్రాడి వయసు ఇరవై ఏళ్లు. అతగాడికి అందరి మాదిరే సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. వాటితో కాలక్షేపం చేసే అతడికి ఫేస్ బుక్ లో పాకిస్తాన్ కు చెందిన ఒక అమ్మాయి పరిచయమైంది.

చాలా తక్కువ కాలంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగి.. ప్రేమగా మారటమే కాదు.. ఆమెను కలిసేందుకు ఎంతటి రిస్కు అయినా సరే సిద్ధమన్నట్లుగా వ్యవహరించాడు. కరాచీలోని షా ఫైసల్ పట్టణంలో ఆమె ఉంటుందట. ఆమెను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి బయలుదేరి గుజరాత్ చేరుకున్నాడు. అప్పటివరకూ ఆమె కోసం 1200 కి.మీ. ప్రయాణించాడు.

ఆమెతో తాను ఫేస్ బుక్.. వాట్సాప్ ద్వారా చాట్ చేస్తానని చెబుతున్నారు. తన ప్రేయసిని కలిసేందుకు స్టార్ట్ చేసిన జర్నీకి అనువుగా  ఉండేందుకు గూగుల్ మ్యాపుల సాయం తీసుకున్నాడు. అతగాడి మాటల్ని విన్న అధికారులు ఉలిక్కిపడ్డారు. గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ వద్ద సరిహద్దు కంచె దాటే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది అతడ్ని గుర్తించారు.

అతడి వద్ద లభించిన పాన్.. ఏటీఎం కార్డుతో పాటు ఆధార్ కార్డు లాంటివి ఉండటంతో అతడు ఎవరన్నది ఇట్టే గుర్తించారు. తమ కొడుకు కొద్ది రోజులుగా కనిపించటం లేదన్న సమాచారాన్ని పోలీసులకు కంప్లైంట్ రూపంలో ఇవ్వటంతో.. ఇతగాడిని చాలా ఈజీగా వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. తనను కలిసేందుకు వచ్చే క్రమంలో తన ప్రియుడికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి పాక్ చిన్నదానికి ఎప్పటికి తెలుస్తుందో?
Tags:    

Similar News