ఆ కిరాతకుడికి జూలై 30న ఉరి

Update: 2015-07-15 07:29 GMT
వందల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నా.. వేలాది మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపినా ఫర్లేదు.. కానీ.. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీసే సమయం దగ్గర పడితే చాలు.. హక్కుల సంఘాల నోటు ఒక్కసారి తెరుచుకుంటాయి. ఎంత ఘోరాపరాధం చేసినా పర్లేదు.. మనిషి ప్రాణం ఎందుకు తీస్తారంటూ ప్రశ్నిస్తారు. దానికి అడ్డదిడ్డమైన వాదనలు వినిపిస్తారు.

ఒక రాక్షసుడి ప్రాణాల కోసం అంతలా తపించి పోయే హక్కుల సంఘాల నేతలకు.. ఆ దుర్మార్గుడి కారణంగా మృతి చెందిన వారివి ప్రాణాలేనని.. సదరు దోషి కారణంగా బాధితులైన వారివి జీవితాలేనని.. తమకు ఏ మాత్రం సంబంధం లేకుండానే బాధితులయ్యామన్న గోడును లైట్ తీసుకుంటారు. ఇలాంటి గొంతులు వినిపించే సమయం తాజా ఆసన్నమైంది.

ఎందుకంటే.. దేశ చరిత్రలో మర్చిపోలేని ఉగ్రఘటనల్లో ముంబయి పేలుళ్ల సంగతి తెలిసిందే. 1993లో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నిందితుడైన యాకూబ్ మెమన్ కు ఉరి విధించారు. అప్పుడెప్పుడో ఉరి పడినా.. చట్టంలోని సౌలభ్యాల పుణ్యామా అని ఇప్పటివరకూ ఆ తీర్పు అమలు కాలేదు.

తన ఉరిని నిలిపివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ వేయటం.. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు చేయటం లాంటివి చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవటంతో ఈ నరహంతక ఉగ్రవాదిని ఈ నెల 30న ఉరి తీయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నాగపూర్ జైల్లో ఉన్న మెమన్ ప్రాణాలు కాపాడటం కోసం హక్కుల సంఘాలు నోరు విప్పటమే ఇక ఆలస్యమేమో.
Tags:    

Similar News