గుప్తనిధులు దాచిన ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి!!

Update: 2020-08-19 04:00 GMT
అనంతపురం జిల్లాలో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి వద్ద డ్రైవర్ గా పని చేసే వ్యక్తి ఇంట్లో 10 ట్రంకు పెట్టెల్లో బంగారం,  వెండి, ఓ పెట్టె నిండా నగదు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకున్నారు.  జిల్లాలోని బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలో ఆయుధాలు,  బంగారం దాచారని సమాచారం అందడంతో డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి మనోజ్ వద్ద డ్రైవర్ గా  పని చేసే నాగలింగ ఇంట్లో తవ్వకాలు జరుపగా 10 ట్రంకు పెట్టెల్లో బంగారం,  వెండి, ఓ పెట్టె నిండా నగదు బయటపడడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. బంగారం,  వెండి, నగదుతో పాటు ఓ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. తవ్వకాలు జరిగిన ప్రాంతానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. దీనిపై డీఎస్పీ వీరరాఘవ రెడ్డి మాట్లాడుతూ బంగారం, ఆయుధాలు దాచి ఉంచారన్న సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామని అయితే ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారం,  నగదు బయటపడిందన్నారు. నాగలింగ ట్రెజరీ  డిపార్ట్మెంట్ ఉద్యోగి మనోజ్ వద్ద పని చేస్తున్నారన్నారు. మనోజే ఈ బంగారం, నగదు ఇక్కడ దాచారని నాగలింగ అంగీకరించినట్లు చెప్పారు. బయటపడ్డ నగదును పోలీసులు లెక్కిస్తున్నారని, ఐటీ శాఖకు కూడా సమాచారం ఇచ్చామని డీఎస్పీ తెలిపారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి మనోజ్,  డ్రైవర్ నాగలింగను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఏదైనా పురాతన ఆలయంలో మనోజ్ కు ఈ నిధి దొరికి  ఉంటుందని, లేదా ఏదైనా ఆలయం నుంచి కాజేసి ఇక్కడ దాచి ఉంటారని అనుమానిస్తున్నారు. బయటపడ్డ మొత్తం నిధి ఇదేనా మరింత పక్కన ఏమైనా  దాచారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 10 ట్రంకు పెట్టెల బంగారం, వెండి, ఓ పెట్టె నగదు బయల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News