ప్రైవేటు ఆస్పత్రికి రూ.10లక్షలు ఫైన్

Update: 2021-05-30 13:00 GMT
అసలే కరోనా కాలం.. ఈ సమయంలో చికిత్స కోసం చేరుతున్న రోగుల విషయంలో మానవత్వం చూపించాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు వాళ్ల రక్తం తాగుతూ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కోవిడ్19 చికిత్స పొందుతున్న రోగులపై భారీ బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ 92 మంది రోగులకు వేర్వేరు మొత్తాలతో అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు మొత్తం 10 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించి సంచలనం సృష్టించింది. మునిసిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి మనుసులు గెలుచుకుంటుంది.

నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి వచ్చిన పత్రికా నోట్ సంచలనమైంది. కోవిడ్ రోగుల నుంచి అధిక వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు ఆస్పత్రులను నాగ్ పూర్ మున్సిపాలిటీ హెచ్చరించింది. 10 లక్షలు ఫైన్ వేసి బాధితులకు ఇవ్వాలని కోరడం చర్చనీయాంశమైంది.

నాగపూర్ లోని రేడియన్స్ హాస్పిటల్ తన కోవిడ్ వార్డులో చేరిన 92 మంది రోగుల నుండి ఒకే పరీక్ష కోసం వేర్వేరు మొత్తాలను వసూలు చేసినట్లు తెలిసింది. మే 20న నాగ్ పూర్ మున్సిపాలిటీ దీనిపై ఆసుపత్రికి నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని ఆసుపత్రిని కోరగా స్పందించలేదు. ఈ ఆరోపణలపై ఆస్పత్రిని తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు.. కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, ఆ తర్వాత ఎన్‌ఎంసి ఉత్తర్వు అందిన ఏడు రోజుల్లోపు సంబంధిత రోగులకు.. వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని నాగ్ పూర్ మున్సిపాలిటీ సదురు ఆసుపత్రిని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ పత్రికా ప్రకటనలో ఆస్పత్రికి భారీ జరిమానా విధించినట్టు తెలిపారు.

ఇవే కాకుండా అంటువ్యాధి.. విపత్తు నిర్వహణ చట్టాలు.. మహారాష్ట్ర ఎసెన్షియల్ సర్వీసెస్ సవరణ చట్టం సెక్షన్ల కింద అధికారులు ఆసుపత్రిపై కేసులు నమోదు చేసి చర్యలను ప్రారంభించనున్నారు.



Tags:    

Similar News