భారత్ కు వరం.. యాపిల్ సీఓఓగా భారత సంతతి సబీఖాన్.. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కంపెనీలో భారత సంతతికి చెందిన వ్యక్తికి అత్యున్నత పదవిలో అవకాశం లభించింది.;

Update: 2025-07-09 07:52 GMT

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కంపెనీలో భారత సంతతికి చెందిన వ్యక్తికి అత్యున్నత పదవిలో అవకాశం లభించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సబీ ఖాన్‌ను యాపిల్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జెఫ్ విలియమ్స్ పదవీ విరమణకు సిద్ధమవుతుండగా ఈ నెలాఖరుతో సబీ ఖాన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకం ప్రపంచ టెక్ రంగంలో భారతీయుల మేధస్సు, నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పింది.

- మూడు దశాబ్దాల పాటు యాపిల్‌కు సేవలందించిన సబీ

సబీ ఖాన్ గత 29 ఏళ్లుగా యాపిల్ సంస్థలో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) హోదాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ సరఫరా గొలుసు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ అత్యాధునిక తయారీ టెక్నాలజీలు అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. 2025 నుంచి సీఓఓగా పనిచేస్తున్న జెఫ్ విలియమ్స్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

- భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా మార్చే దిశలో...

యాపిల్ సంస్థ ప్రస్తుతం భారత్‌ను ఒక ప్రధాన తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత మూలాలున్న సబీ ఖాన్‌ను సీఓఓగా నియమించడం అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. భారత్‌లోని తయారీ యూనిట్ల విస్తరణ, సరఫరా వ్యవస్థ బలోపేతానికి ఇది ఒక పెద్ద మైలురాయిగా మారనుంది.

- సబీ ఖాన్ ఎవరు?

1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ప్రాథమిక విద్య సింగపూర్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1995లో యాపిల్‌లో చేరారు. ఆయన తక్కువకాలంలోనే యాపిల్‌లో తన పనితీరు ద్వారా విశేష గుర్తింపు పొందారు.

- టిమ్ కుక్ ప్రశంసలు

సబీ ఖాన్‌పై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. “సబీ ఒక అద్భుతమైన వ్యూహకర్త. యాపిల్ సరఫరా వ్యవస్థను స్థిరీకరించడంలో అత్యాధునిక తయారీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో ఆయన అద్భుతమైన పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించగల నాయకుడు ఆయన” అని కొనియాడారు. సబీ ఖాన్ నాయకత్వంలో యాపిల్ ఆపరేషన్లు మరింత దృఢంగా ప్రగతిశీలంగా మారుతాయని పరిశ్రమవర్గాలు ఆశిస్తున్నాయి.

Tags:    

Similar News