ఇక అమెరికా వెళ్లలేం.. హెచ్1బీకి ఎసరు పెడుతున్నారు
ఈ బిల్లులో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. కనీస వేతనాన్ని $200,000 కు పెంచడం.;
దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి యువతకు 'అమెరికా కల' ఒక జీవన సాఫల్య చిహ్నం. గ్రీన్ కార్డులు, డాలర్ల సంపాదన, మెరుగైన జీవన ప్రమాణాలు.. ఇవే లక్ష్యంగా సాగిన ఈ ప్రయాణంలో హెచ్-1బీ వీసా ఒక ప్రధాన వారధిగా నిలిచింది. అయితే రిపబ్లికన్ నేత ఎలి క్రేన్ ప్రతిపాదించిన ‘H-1B వీసా దుర్వినియోగ నివారణ చట్టం - 2026’ బిల్లు ఇప్పుడు ఆ వారధికి బీటలు వేస్తోంది. ఇది కేవలం ఒక వీసా నియమ నిబంధనల మార్పు మాత్రమే కాదు.. గ్లోబల్ టాలెంట్ మార్కెట్‌లో వస్తున్న ఒక పెను మార్పుకు సంకేతం.
నిబంధనల కొరడా.. ఎవరి కోసం?
ఈ బిల్లులో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. కనీస వేతనాన్ని $200,000 కు పెంచడం. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీని వెనుక ఉన్న వ్యూహం స్పష్టం. "సాధారణ నైపుణ్యాలకు అమెరికాలో చోటు లేదు." అని తేల్చిచెప్పండి. ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో ఐటీ సేవలను అందించిన 'మాస్ రిక్రూట్మెంట్' మోడల్ ఇకపై మనుగడ సాగించడం కష్టం. బ్రాండన్ గిల్ వంటి నేతలు వాదిస్తున్నట్టుగా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం ఒక ఎజెండా అయితే అత్యుత్తమ ప్రతిభావంతులను మాత్రమే దేశంలోకి రానివ్వడం రెండో ఎజెండా.
భారతీయ ఐటీ దిగ్గజాలకు 'అగ్నిపరీక్ష'
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలకు ఇది ఒక పెద్ద సవాలు. వీసా ఖర్చులు, పెరిగిన వేతనాల భారం వల్ల 'ఆన్‌సైట్' ప్రాజెక్టులు తగ్గక తప్పదు. అయితే ఇది భారత్‌కు ఒక రకంగా 'డిజిటల్ ఆశీర్వాదం' కూడా కావచ్చు. అమెరికాకు వెళ్లలేకపోయినా భారత్ నుంచే ఆ ప్రాజెక్టులు చేసే 'రిమోట్ వర్క్' సంస్కృతి బలపడుతుంది. అత్యుత్తమ మేధస్సు కలిగిన యువత దేశంలోనే ఉండి స్టార్టప్‌లు ప్రారంభించే అవకాశం పెరుగుతుంది.
విద్యార్థులకు 'రెడ్ అలర్ట్'.. కానీ!
ఓపీటీ వంటి వెసులుబాట్లపై వేటు పడటం విద్యార్థులను ఆందోళనకు గురిచేసే అంశమే. కానీ దీని అర్థం తలుపులు మూసుకుపోయాయని కాదు.. ఆ తలుపులు చాలా ఎత్తులో ఉన్నాయని గ్రహించాలి. ఇకపై కేవలం 'డిగ్రీ' కోసం అమెరికా వెళ్లే కాలం చెల్లింది. ఏఐ , క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, సైబర్‌సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ నైపుణ్యం ఉంటేనే అమెరికా వీసా దక్కుతుంది. అమెరికా మార్కెట్ ఇప్పుడు "క్వాంటిటీ" (సంఖ్య) నుంచి "క్వాలిటీ" (నాణ్యత) వైపు మళ్లుతోంది.
స్థాయి పెంచుకోవాల్సిన సమయం
అమెరికా విదేశీ వలస విధానం ఇప్పుడు "హార్డ్ మోడ్" లోకి ప్రవేశించింది. దీనిని ఒక విపత్తుగా చూడటం కంటే మన నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి పెంచుకోవడానికి ఒక హెచ్చరికగా భావించాలి. అమెరికా కాకపోతే కెనడా, జర్మనీ లేదా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పుడు భారతీయ టాలెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి.
అమెరికా కల చెదిరిపోలేదు.. అది తన రూపం మార్చుకుంది. సామాన్యుల నుంచి అసామాన్యులను వేరు చేసే ఈ వడపోతలో నిలబడాలంటే మన యువత "సాధారణం" నుంచి "అసాధారణం" వైపు ప్రయాణించక తప్పదు.