పంచాయ‌తీ పోరుపై మ‌ళ్లీ అదే 'ల‌డాయి'!

ఇప్పుడు స‌ద‌రు జీవోను స‌వ‌రించి.. బీసీల‌కు 17 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తూ..(మొత్తంగా 50 శాతం) జీవో 49నిప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.;

Update: 2025-11-27 06:34 GMT

తెలంగాణలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ఇప్ప‌టికే ఒక‌సారి వాయిదా ప‌డ్డాయి. రెండు నెల‌ల కింద‌ట రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు పంచాయ‌తీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసి.. ప్ర‌ణాళిక అమ‌లుకు రంగం రెడీ చేసిన మ‌రుస‌టి రోజే.. కోర్టు వివాదంతో వాయిదా ప‌డ్డాయి. అప్ప‌ట్లో రిజ‌ర్వేష‌న్‌ల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో(42 శాతం బీసీల‌కు సీట్లు ఇచ్చేలా)ను స‌వాల్ చేస్తూ.. రెడ్డి సామాజిక వ‌ర్గం సామాజిక కార్య‌కర్త కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఎన్నిక‌ల‌కు బ్రేక్ ప‌డింది.

ఇప్పుడు స‌ద‌రు జీవోను స‌వ‌రించి.. బీసీల‌కు 17 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తూ..(మొత్తంగా 50 శాతం) జీవో 49నిప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఆ మ‌రుస‌టి రోజే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పంచాయ‌తీ ఎన్నిక‌ల పోరుకు సంబంధించి షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనికి సంబంధించి వ‌చ్చే నెల‌లో మూడు డేట్లు కూడా ప్ర‌క‌టించింది. మూడు విడ‌త‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ కూడా నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, జిల్లాల స్థాయిలో అధికారులు కూడా షెడ్యూల‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న స‌ర్క్యుల‌ర్‌లు జారీ చేశారు.

అయితే.. తాజాగా బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర హైకోర్టులో ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ.. ఏకంగా 9 పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిలో మెజారిటీ పిటిష‌న్ల‌లో బీసీల‌కు 17 శాతం మాత్ర‌మే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ.. పిటిష‌నర్లు కోర్టును ఆశ్ర‌యించారు. జీవో 49 రాజ్యాంగ స్ఫూర్తికి, బీసీ హ‌క్కుల‌కు విరుద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రికొంద‌రు.. మొత్తంగా బీసీలు ఉన్న చోట కూడా.. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ.. జిల్లా ఎన్నిక‌ల అధికారులు గెజిట్‌ ప్ర‌క‌ట‌న చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

1) బీసీ జ‌నాభా 42 శాతం ఉన్నా.. వారికి కేటాయించి రిజర్వేషన్లు 17 శాతానికి మించడంలేదని సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య త‌న పిటిషన్ లో పేర్కొన్నారు.

2) రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు బీసీ రిజర్వేషన్లు 17శాతం మాత్రమే కేటాయించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ.. ఆరుగురు వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. జీవో 46కు విరుద్ధంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు.

3) కల్వకుర్తి నియోజకవర్గంలోని తిమ్మనోనిపల్లి గ్రామంలో 8 వార్డులుండగా అన్నింటినీ ఎస్సీ, ఎస్టీలకే కేటాయించారంటూ.. మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. ఇక్క‌డ బీసీ జనాభా ఎక్కువ‌గా ఉంద‌ని.. వారికే ఇవ్వాల‌ని కోరారు. మొత్తంగా ఈ పిటిష‌న్ల‌తో మ‌రోసారి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని న్యాయ‌వాదులు చెబుతున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News