అల్లాటప్పా కేసులకు కూడా సీబీఐయేనా? సుప్రీం సీరియస్ కామెంట్స్
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసులు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసులు అప్పగించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రతిష్ఠ పెంచడంతోపాటు రాష్ట్ర పోలీసుల ఆత్మగౌరవాన్ని పెంచేలా సుప్రీం వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు హైకోర్టులు కూడా ఇకపై సీబీఐకి కేసులు అప్పగించే విషయమై ఆచితూచి వ్యవహరించకతప్పదనే చర్చ జరుగుతోంది.
దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులు సాధారణ కేసులను సైతం సీబీఐకి రిఫర్ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన శాసనమండలి ఉద్యోగుల అవినీతిపై సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఏ కేసు పడితే ఆ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు.. అత్యున్నత దర్యాప్తు సంస్థకు అప్పగించాల్సిన కేసులపై నిర్దిష్ట సూచనలు చేసింది. సీబీఐకి ఇవ్వాల్సిన కేసులను సమగ్రంగా అధ్యయనం చేయాలని నిర్దేశించింది. ఆయా కేసుల్లో రాజకీయ పరిణామాలు, కీలక నేతల ప్రమేయం, ప్రభుత్వ ఉదాసీనత ఉన్నప్పుడు మాత్రమే సీబీఐకి కేసులను రిఫర్ చేయాలని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని శాసనమండలిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయగా, హైకోర్టులో కొందరు సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. అయితే తాము నిబద్ధతతో విచారణ చేస్తుంటే సీబీఐకి బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ పోలీసుశాఖ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పోలీసుల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టింది.
పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఏ కేసు పడితే ఆ కేసును సీబీఐకి ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. అత్యంత కీలకమైన కేసులు, మెజార్టీ వర్గాలపై ప్రభావం చూపుతాయని భావించిన సమయంలోనే సీబీఐకి సిఫార్సు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రమేయం, అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే వాటిని సీబీఐకి బదిలీ చేయవచ్చని సూచించింది. లేని పక్షంలో అత్యంత కీలకమైన సీబీఐని దుర్వినియోగం చేసినట్టే అవుతుందని అభిప్రాయపడింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను పరిశీలించాలని హితవు పలికింది.
కాగా, సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐని వాడుకుంటున్నారని ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కొన్ని నిర్దిష్ట పరిమితులు విధించడం వల్ల సీబీఐపై విమర్శలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో ఏపీలో కూడా ఓ కేసు వ్యవహారంలో రాష్ట్ర పోలీసుల తీరును తప్పుబడుతూ సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. సుప్రీం తాజా ఆదేశాలతో ఈ కేసు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను గంజాయి కేసులో తాడేపల్లి పోలీసులు అరెస్టు చేయగా, అతడిని అక్రమంగా నిర్బంధించారని నిందితుడు భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల పోలీసుల తీరును సందేహిస్తూ సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు సుప్రీంలో సవాల్ చేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.