ఉరితీస్తే తప్ప అత్యవసర విచారణ లేదు.. సుప్రీంకోర్టు సంచలనం
ఎవరికైనా ఉరిశిక్ష అమలు అవుతున్న సందర్భం తప్ప, మరే ఇతర కేసునూ అదే రోజున అత్యవసరంగా విచారించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ప్రకటన చేసింది.;
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యవసర విచారణల విషయంలో మరోసారి కఠినమైన వైఖరిని స్పష్టం చేసింది. ఎవరికైనా ఉరిశిక్ష అమలు అవుతున్న సందర్భం తప్ప, మరే ఇతర కేసునూ అదే రోజున అత్యవసరంగా విచారించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ప్రకటన చేసింది.
ఈ సంచలన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ పనితీరుపై పెరుగుతున్న ఒత్తిడిని.. న్యాయమూర్తుల సమయపాలనను దృష్టిలో ఉంచుకుని చేసినట్లుగా భావించవచ్చు.
*ఏం జరిగింది?
బుధవారం అత్యవసర జాబితా కోసం కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. న్యాయవాది శోభా గుప్తా, రాజస్థాన్‌కు చెందిన ఒక నివాస గృహాన్ని అదే రోజు వేలం వేయనున్న నేపథ్యంలో ఆ విషయంపై తక్షణం అత్యవసర విచారణ జరపాలని కోరుతూ కోర్టుకు పిటిషన్‌ను సమర్పించారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎవరినైనా ఉరి తీస్తున్న సందర్భంలో తప్ప, మేము ఇతర కేసులను అత్యవసరంగా చూడలేము. న్యాయమూర్తుల పని గంటలు, ఒత్తిడి ఏవరైనా గమనించారా? మేము ఎంత నిద్రపోతున్నామో తెలుసా?" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తి ఆగ్రహంలో న్యాయవ్యవస్థపై ఉన్న విపరీతమైన భారం స్పష్టంగా కనిపించింది. ప్రతి చిన్న అంశానికీ అత్యవసర విచారణ కోరడాన్ని న్యాయస్థానం ఈ విధంగా తప్పుబట్టింది.
* పిటిషన్‌పై తీర్పు
అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు వేలం నోటీసు గత వారం జారీ అయ్యిందని, బకాయి మొత్తంలో సగం చెల్లించారని లాయర్ తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి, ఈ పిటిషన్‌ను శుక్రవారం జాబితాలో చేర్చాలని సూచించారు. అంటే, ఆస్తి వేలం వంటి అంశాలు వెంటనే విచారించాల్సిన అత్యవసర కేసులు కాదని కోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది.
* కీలక సందేశం: స్వేచ్ఛకే ప్రథమ స్థానం
సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే.. ఒక వ్యక్తి స్వేచ్ఛ లేదా జీవించే హక్కు ప్రమాదంలో ఉన్న సందర్భాలకు మాత్రమే అత్యవసర విచారణను పరిమితం చేయాలి. ఉరిశిక్షకు వ్యతిరేకంగా అప్పీల్, లేదా అక్రమ అరెస్టు వంటి సందర్భాల్లో మినహా, ఆస్తి లేదా ఇతర వివాదాలను అదే రోజు విచారణకు తీసుకోవడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
న్యాయ వ్యవస్థలో సమయపాలన, న్యాయమూర్తుల గౌరవం.. పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని విచారణలను కోరాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులకు కీలక సంకేతం ఇచ్చింది. అత్యవసర విచారణల విషయంలో ఇకపై న్యాయస్థానం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.