రాష్ట్రపతి, గవర్నర్లే సుప్రీం.. ధర్మాసనం కీలక తీర్పు

చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.;

Update: 2025-11-20 06:23 GMT

చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. బిల్లలకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. గడువు నిర్దేశించడం సబబేనంటూ ఓ వైపు.. అది రాజ్యాంగానికి విరుద్ధమనే వాదనలు మరోవైపు ముసురుకున్న నేపథ్యంలో ధర్మాసనం తుదితీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని ధర్మాసనం అభిప్రాయపడింది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరని ఆర్టికల్ 200 కింద వారికి విచక్షణ అధికారం ఉంటుందని ధర్మాసనం వివరించింది.

అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సుదీర్ఘకాలం జాప్యం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆ గడువులోగా నిర్ణయం వెలువరించకుంటే.. ఆ బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించవచ్చని పేర్కొంది. దీనితో గవర్నర్‌ ఆమోదించకుండా పక్కనపెట్టిన పది బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

ఇలా రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ తాము అప్పీళ్లను విచారించబోమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించి.. వివరణ, సలహాలు కోరారు. ‘బిల్లులకు ఆమోదం అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని న్యాయవ్యవస్థ గడువులు నిర్దేశించవచ్చా? అని స్పష్టత కోరారు.

పరస్పర భిన్న వాదనల మధ్య..

రాష్ట్రపతి అడిగిన అంశాలకు సంబంధించి జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ, జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదన వినిపించాయి. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయవ్యవస్థ గడువు విధించడం సరికాదని అటార్నీ జనరల్‌ ఆర్‌.వేంకటరమణి కోర్టుకు వివరించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి అధికారాల్లో జోక్యం చేసుకోవడం వివిధ వ్యవస్థల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని వాదించారు.

బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ‌సగఢ్‌ రాష్ట్రాలు కేంద్ర వాదనను సమర్థించాయి. మరోవైపు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలు గవర్నర్లకు గడువుపెట్టడం సరైనదేనంటూ సుప్రీం తీర్పును సమర్థించాయి. వాదనలన్నీ విన్న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సెప్టెంబరు 11న తమ నిర్ణయాన్ని రిజర్వు చేసింది. ఈ ఆదివారం చీఫ్ జస్టిస్ గవాయ్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో గురువారం సుప్రీం ధర్మాసనం తుదితీర్పు వెలువరించింది.

Tags:    

Similar News