సంచలనం: 32 ఏళ్ల జైలు విధించిన నల్గొండ కోర్టు.. వాడేం చేశాడు?

నల్గొండ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కు విధించిన ఈ శిక్ష ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందన్న అంశంలోకి వెళితే..;

Update: 2025-10-23 06:58 GMT

ఒక కేసులో నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మాయమాటలు చెప్పి మైనర్ ను పెళ్లాడి.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 32 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. నల్గొండ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కు విధించిన ఈ శిక్ష ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందన్న అంశంలోకి వెళితే..

నల్గొండ పట్టణంలోని పానగల్ ప్రాంతానికి చెందిన చందు అనే ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. నల్గొండకు సమీపంలోని ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకొని తరచూ ఫోన్ మాట్లాడేవాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి 2022 సెప్టెంబరు 19న తన ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చందు బాలికను సెప్టెంబరు 25న నల్గొండలో దింపేసి వెళ్లిపోయాడు. ఆమెను పోలీసులు భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

ఈ సందర్భంగా సదరు మైనరు బాలిక పలు విషయాల్ని వెల్లడించింది. తనను ఆటోలో తీసుకెళ్లిన తర్వాత ఒక గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడించింది. తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి.. భార్యాభర్తలమని చెప్పి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా వాంగ్మూలాన్ని ఇచ్చింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేవారు.

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు 20 ఏళ్ల జైలు.. రూ.25 వేల ఫైన్ విధించటంతో పాటు ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసిన నేరానికి పదేళ్లు జైలు రూ.25వేలు ఫైన్ విధించారు. ఈ రెండు శిక్షలు ఏక కాలంలో అమలవుతాయని పేర్కొంది. వివాహ నిషేధ చట్టం కింద మరో రెండేళ్లు జైలుతో పాటు రూ.75 వేలు ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చింది. .దీంతో మొత్తంగా నిందితుడు చందుకు 32 ఏళ్లు జైలు.. రూ.75 వేలు ఫైన్ తో పాటు బాధితురాలికి డీఎస్ఎల్ఏ ద్వారా రూ.10 లక్షలు పరిహారం అందించాలని తీర్పును ఇచ్చింది. ఇదిలా ఉండగా.. బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన కేసులో సంగారెడ్డి పోక్సో కోర్టు న్యాయాధికారి మరో నిందితుడికి జీవితకాలం ఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చారు. రెండు ఉదంతాలు ఒకే సమయంలో బయటకు రావటం.. పోక్సో కేసుల్లో కోర్టులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న దానికి నిదర్శనంగా ఈ రెండు ఉదంతాలు నిలిచాయని చెప్పాలి.

Tags:    

Similar News