మద్యం కేసులో చెవిరెడ్డికి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టుకు రంగం సిద్ధం!

ముందస్తు బెయిలు కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.;

Update: 2025-10-07 11:59 GMT

ఏపీ మద్యం స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మోహిత్ రెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ గతంలో నోటీసులు జారీ చేయగా, అరెస్టు భయంతో ఆయన ముందస్తు బెయిలుకు కోర్టును ఆశ్రయించారు. తొలుత విచారణ కోర్టులో అనంతరం హైకోర్టులో ఆయన పిటిషన్లు దాఖలు చేయగా, రెండు చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి.

ముందస్తు బెయిలు కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితుడికి ముందస్తు బెయిలు నిరాకరిస్తూ ఆయన పిటిషన్ కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. గత ప్రభుత్వంలో తుడా చైర్మనుగా పనిచేసిన మోహిత్ రెడ్డి మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు సమకూర్చారని ఆయనపై కేసు నమోదైంది. అయితే తన ప్రతిష్ఠను దిగజార్చేందుకే కేసులో ఇరికించారని, దర్యాప్తునకు సహకరిస్తానని, కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని బెయిలు ఇవ్వాల్సిందిగా మోహిత్ రెడ్డి కోర్టులో అభ్యర్థించారు.

అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో మోహిత్ రెడ్డి అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు మోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇదివరకే అరెస్టు అయ్యారు. ఆయన ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. అనారోగ్యం కారణంతో బెయిలు కోసం ఆయన చేస్తున్న పోరాటం ఇప్పటివరకు కొలిక్కిరాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో తదుపరి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలక నేతగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో చెవిరెడ్డి ఒకరు. జగన్ నమ్మినబంటు అయిన చెవిరెడ్డి లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, ఆయన కుమారుడిని కూడా ఇదే కేసులో అరెస్టు చేయడానికి ప్రభుత్వం పావులు కదుపుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక లిక్కర్ కేసులో అరెస్టు అయిన వారికి వరుసగా బెయిలు మంజూరు అవుతున్న దశలో మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిలు నిరాకరించడంతో ఆయన తదుపరి వ్యూహం ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News