భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువైతే భరణం అక్కర్లేదు
భార్యభర్తల మధ్య విడాకుల పంచాయితీకి సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.;
భార్యభర్తల మధ్య విడాకుల పంచాయితీకి సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. విడాకుల వేళ భార్యలకు భర్తలు చెల్లించే భరణం విషయంలో ఆసక్తికర అంశాల్ని వెలువరించింది. భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉంటే.. అలాంటి మహిళకు భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. అంతేకాదు.. భరణం ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. చెన్నైకు చెందిన వైద్య దంపతులకు ఒక కొడుకు ఉన్నారు.
అయితే.. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తటంతో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకు నెలకు రూ.30వేలుచొప్పున భరణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ సదరు వైద్యుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో భాగంగా తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో కీలక నిర్ణయాన్ని వెలువరించారు.
కొడుకు ప్రిపేర్ అవుతున్న నీట్ ఎగ్జామ్ ఖర్చు కోసం రూ.2.77 లక్షలు ఇచ్చేందుకు పిటిషనర్ అంగీకరించిన విషయాన్ని పేర్కొన్నారు. అదే సమయంలో సదరు పిటిషనర్ తన భార్యకు అధికంగా ఆస్తులు.. ఆదాయం ఉన్నట్లుగా పేర్కొంటూ.. ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్న పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో కొడుకు చదువు విషయంలో కోర్టు జోక్యం చేసుకోదంటూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.