రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య.. కోర్టు సంచలన తీర్పు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ (19) హత్య కేసులో ఉత్తరాఖండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.;
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ (19) హత్య కేసులో ఉత్తరాఖండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ నేత కుమారుడైన పుల్కిత్ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేసిన అంకితా బండారీ అదృశ్యమైన కొన్ని రోజులకు కాలువలో శవమై తేలడంతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇందులో సిట్ 500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది.
అవును... 2022లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసులో ఉత్తరాఖండ్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా బీజేపీ మాజీ నాయకుడి కుమారుడు పుల్కిత్ ఆర్యతో పాటు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా తేల్చింది. ఈ సమయంలో వారికి రూ.50 వేల జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.
వాస్తవానికి పుల్కిత్ ఆర్యకు చెందిన ‘వనంతరా’ రిసార్టులో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న అంకిత 2022 సెప్టెంబర్ 18న కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత చిల్లా కాలువలో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో... ఈ సంఘటన మహిళల భద్రత, రాజకీయ ప్రభావంపై జాతీయస్థాయిలో చర్చనీయంశంగా మారింది.
ఈ సమయంలో ముందస్తు దర్యాప్తులో కేసు కొలిక్కిరాకపోవడంతో పాటు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఆరోపణలు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. దీంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ 97 మంది సాక్ష్యులను విచారించింది. ఫైనల్ గా 500 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.
ఈ క్రమంలో పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరు నిందితులపై భారత న్యాయ సంహిత సెక్షన్లు 302, 354ఏ, 201 కింద అభియోగాలు మోపబడ్డాయి. రిసార్ట్ కు వచ్చే క్లైంట్లకు "స్పెషల్ సర్వీస్" అందిచాలని అంకితపై పుల్కిత్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆమె నిరాకరించడంతోపాటు రిసార్టులో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హెచ్చరించినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు!
దీంతో.. ఈ రోజు వీరికి కోర్టు శిక్ష విధించింది. కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందు అంకిత తల్లి.. ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. అయితే... న్యాయమూర్తి ఈ ముగ్గురికి జీవిత ఖైదు విధించారు.