అటు లడ్డూ కేసు.. ఇటు పరకామణి ఎపిసోడు.. సీనియర్ నేత వైవీకి తీవ్ర ఇబ్బందులు?
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇబ్బందులు తలెత్తనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.;
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇబ్బందులు తలెత్తనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో సుమారు నాలుగేళ్లపాటు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మనుగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి స్వయాన బాబాయ్ అయిన వైవీ.. అప్పట్లో టీటీడీలో చక్రం తిప్పారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో వైవీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీలో నాసిరకం, కల్తీ నెయ్యిని వాడారనే అభియోగాలను తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో వైవీ పదవీ కాలంలోనే పరాకమణిలో చోరీ జరిగిందని, ఆ కేసులో పట్టుబడిన నిందితుడుతో చట్టవిరుద్దంగా రాజీ చేసుకున్నారని మరో వివాదాన్నిరేపింది. ఈ రెండు అంశాలపై సుప్రీం, హైకోర్టులు జోక్యం చేసుకోవడం, ప్రత్యేక దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేయడంతో మాజీ చైర్మన్ వైవీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కల్తీ నెయ్యి కేసులో కొద్దిరోజుల క్రితం సిట్ విచారణను ఎదుర్కొన్న వైవీ.. తాజాగా పరకామణి చోరీపైనా సీఐడీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కల్తీ నెయ్యి కేసులో వైవీ మాజీ పీఏ చిన్న అప్పన్నను సీబీఐ సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో వైవీ పాత్ర కూడా ఉండి ఉంటుందని ప్రభుత్వ అనుకూల మీడియాతోపాటు టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ కేసులో వైవీని పూర్తిగా టార్గెట్ చేయడంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని వ్యాఖ్యానాలు వినిపించాయి. దీంతో తిరుపతిలో జరిగే విచారణకు తాను రాలేనని, అవకాశం ఉంటే సిట్ పోలీసులు హైదరాబాదులో తన నివాసానికి రావాల్సిందిగా వైవీ సమాచారం పంపారు. ఇక ఆ కేసులో విచారణ పూర్తవ్వగా, ఇప్పుడు పరకామణి కేసులో విచారణకు విజయవాడ వచ్చారు.
ఇలా ఎడాపెడా కేసుల విచారణకు వైవీ హాజరు కావాల్సివస్తుండటం, ఆయన పాత్ర ఉందంటూ హైలెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో సీనియర్ నేత సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తాను లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని, తనపై అసత్య ప్రచారం ఆపాలని ప్రాధేయపడుతున్నారు. ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి తర్వాత చైర్మనుగా బాధ్యతలు చేపట్టిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సైతం తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన భూమన విచారణలో వైవీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడే పరకామణి చోరీ రాజీపై ఫైల్ తయారైందని వాంగ్మూలమిచ్చారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైవీని సిట్ ప్రశ్నించగా, తన చైర్మను పదవీకాలం ముగిసిన తర్వాతే పరకామణి చోరీ కేసు వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. అయితే పరకామణి చోరీపై ఫిర్యాదు, ఆ తర్వాత చార్జిషీటు దాఖలు చేసిన తేదీ, కేసును రాజీ చేసుకున్న రోజు అన్నీంటిపై సిట్ వద్ద పూర్తి ఆధారలు ఉండటంతో వాటిని వైవీ ఎదుట పెట్టి ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. అయితే కేసు విచారణ అనంతరం బయటకు వచ్చిన వైవీ.. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మీడియాను వేడుకున్నారు. మొత్తం పరిణామాలను పరిశీలిస్తే రెండు కేసుల్లోనూ వైవీని ఇబ్బంది పెట్టే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డి చైర్మనుగా ఉండగానే నిబంధనలు మార్చారని సిట్ వాదిస్తోంది. అదే సమయంలో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉన్నా, ఆయన పట్టించుకోలేదని అంటోంది. మరోవైపు నెయ్యి కల్తీపై విచారణకు తానే సుప్రీంలో పిటీషన్ వేశానని తప్పు చేసినట్లు అయితే తానెందుకు కోర్టుకు వెళతానని మాజీ చైర్మను సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఇక పరాకమాణి చోరీ రాజీపై నిన్నమొన్నటి వరకు మాజీ చైర్మన్ భూమనపై అనుమానం వ్యక్తం చేస్తూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన విచారణ అనంతరం వైవీపై అనుమానాలు పెరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి సుబ్బారెడ్డి విషయంలో ఏదో జరుగుతుందనే సందేహాలు ఉత్కంఠ రేపుతున్నాయి.