త్యాగాల వల్లే ఛాంపియన్ పుట్టాడు.. భార్య, యువరాజ్‌పై యోగరాజ్ ఆవేశం
మాజీ క్రికెటర్, బాలీవుడ్ నటుడు యోగరాజ్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలోని గుండె పగిలే బాధను, ఆవేశాన్ని తాజాగా వ్యక్తం చేశారు.;
మాజీ క్రికెటర్, బాలీవుడ్ నటుడు యోగరాజ్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలోని గుండె పగిలే బాధను, ఆవేశాన్ని తాజాగా వ్యక్తం చేశారు. తన మాజీ భార్య శబ్నం , కుమారుడు, భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ (యువి) తమను వదిలి వెళ్లిన తర్వాత తాను అనుభవించిన ఏకాంతం, ఆకలి, పశ్చాత్తాపం గురించి ఆయన ఇటీవల ‘అన్ టోల్డ్ పంజావ్’ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
* నా జీవితంలో ఆ పెద్ద మలుపు
తన జీవితంలో ఎన్నో తప్పులు చేసిన "పాపి"నని యోగరాజ్ సింగ్ అంగీకరించారు. అయితే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటనగా తన భార్య, కుమారుడు తమను వదిలి వెళ్లడాన్ని పేర్కొన్నారు. "నా జీవితమంతా బాధలతో నిండిపోయింది. కానీ యువి (యువరాజ్) , అతని తల్లి నన్ను వదిలి వెళ్లిన రోజు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే నా జీవితంలో పెద్ద మలుపు.”
* 'బాబా' భక్తిపై ఆవేదన
తన భార్య శబ్నం తమను వదిలి ఒక 'బాబా'ను అనుసరించడం ప్రారంభించిందని యోగరాజ్ ఆరోపించారు. దీనిపై ఆయన వ్యక్తం చేసిన ఆవేశం కేవలం తన ఇంటి సమస్యకే కాకుండా, సమాజంలోని ఇతర మహిళలకు కూడా వర్తిస్తుందని అన్నారు. “నీ భర్త కోసం వండలేవు, కానీ ఆ బాబాకి వంట చేయడానికి సిద్ధమయ్యావా? గురు గ్రంథ్ సాహిబ్ కన్నా గొప్పది ఏదీ లేదు.” అన్నారు.
* తండ్రి త్యాగం: ఒంటరి పోరాటం
యువరాజ్ సింగ్‌ను ఒక లెజెండ్‌గా మార్చాలనే తపనతోనే తాను జీవించినట్లు యోగరాజ్ సింగ్ తెలిపారు. యువి ఇండియా జట్టుకు ఆడిన సమయంలో తాను జైలులో ఉన్నానని కూడా గుర్తు చేసుకున్నారు. వారు వెళ్లిపోయాక తాను పూర్తిగా ఒంటరిగా మారిపోయానని, వర్షంలో ఆకలితో వీధుల్లో తిరిగిన కఠినమైన రోజులను గుర్తుచేసుకున్నారు.
అయితే, దేవుడు తనను వదల్లేదని, తన జేబులో ఐదు రూపాయలు కూడా లేని సమయంలో ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో తనకు ఐదు లక్షలు ఆఫర్ వచ్చిందని తెలిపారు. గతంలో "నాకు కుటుంబం లేదు, అందరూ నన్ను వదిలేశారు. కానీ ఆ త్యాగాల వల్లే ఒక ఛాంపియన్ పుట్టాడు" అని గర్వంగా చెప్పిన యోగరాజ్, ఇప్పుడు మాత్రం చేసిన పాపాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.
* యువరాజ్‌పై భావోద్వేగ ప్రశ్నలు
కుమారుడు యువరాజ్ సింగ్‌పై యోగరాజ్ తీవ్రమైన ఆవేశంతో కూడిన ప్రశ్నలు సంధించారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తండ్రి కంటే ఆ 'బాబా' గొప్పవాడా అని ప్రశ్నించారు. "నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన తండ్రి కంటే ఆ బాబా గొప్పవాడా? నీ తండ్రికి ఒక్క కుర్తా-పైజామా కొనిపెట్టలేదు కానీ ఆ బాబాకి రూ.15 లక్షల గడియారం ఇచ్చావు. "నాకో ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆ బాబా కుటుంబమే అంతా?" అంటూ మండిపడ్డారు.
తాను యువరాజ్ కోసం రక్తం, చెమట, కన్నీళ్లు కార్చానని, కానీ తండ్రి త్యాగాన్ని మరిచి బాబా పట్ల భక్తి చూపిన కుటుంబ సభ్యుల ప్రవర్తనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పంజాబ్‌లో క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్న యోగరాజ్ సింగ్, 'సింగ్ ఇజ్ బ్లింగ్', 'భాగ్ మిల్కా భాగ్' వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. ఈ తాజా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసి, మరోసారి వార్తల్లో నిలిచాయి.