ఆ వైసీపీ మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నట్టేనా..!
ఇలా.. కొందరు మంత్రులకు మార్పులు జరిగాయి. అయితే.. కీలకమైన మరింత మంది మంత్రుల విషయంలో మాత్రం వైసీపీ తర్జన భర్జన పడుతోంది.
వైసీపీలో కొందరు మంత్రులకు ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు. ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి తానేటి వనితను గోపాలపురం పంపించారు. స్థానికంగా.. సెగ పెరగడం.. ఆమెకు వ్యతిరేకంగా సొంత నేతలే జెండా లెత్తడంతో మార్పు జరిగింది. ఉమ్మడి అనంతపురంలోని కళ్యాణదురం ఎమ్మెల్యే కమ్ మంత్రి ఉషశ్రీచరణ్‌కు కూడా.. ఇదే పరిస్థితి ఎదురై.. ఆమెను పెనుకొండకు మార్చారు.
ఇక, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి.. గుమ్మనూరు జయరాంను కూడా స్థాన చలనం కలిగింది.. కర్నూలు ఎంపీగా పంపించారు. ఇక, మరో మంత్రి, ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను కూడా కొండపికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక, రామచంద్రపురం ఎమ్మెల్యే కమ్ మంత్రి చెల్లుబోయిన వేణును రాజమండ్రి రూరల్‌కు పంపించారు. అలాగే చిలకలూరి పేట ఎమ్మెల్యే కమ్ మంత్రి విడదల రజనీకి కూడా.. మార్పు తప్పలేదు. ఆమెను గుంటూరు వెస్ట్ కు పంపించారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టికెట్ ఇస్తున్నారనే చర్చ వెలుగు చూసింది.
ఇలా.. కొందరు మంత్రులకు మార్పులు జరిగాయి. అయితే.. కీలకమైన మరింత మంది మంత్రుల విషయంలో మాత్రం వైసీపీ తర్జన భర్జన పడుతోంది. వీరిలో ఎక్కువగా విమర్శలు.. వ్యతిరేకత ఎదుర్కొం టున్న మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పలాస ఎమ్మెల్యే కమ్ మంత్రి సీదిరి అప్పలరాజు ముందు వరుసలో ఉన్నారు. అదేసమయంలో ధర్మాన ప్రసాద రావు కూడా.. వివాదాల్లోనే చిక్కుకున్నారు. ఆయన దురుసు ప్రవర్తన.. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. ఇక, సీదిరి సొంత పార్టీ నేతల సెగ మామూలుగా లేదు. ఆయనను ఓడిస్తామని మత్స్యకార వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి.
అలాగే.. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం కూడా.. పుంగనూరులో విమర్శలకు తావిస్తోంది. దీంతో వీరిపరిస్థితి ఏంటి? వీరిని కూడా నియోజకవర్గాలు దాటిస్తారా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. వీరిలో రోజా, సీదిరిని మార్చే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తుండగా.. మిగిలిన వారిని యథాతథంగా కొనసాగిస్తారని సీనియర్లు చెబుతున్నారు. వారికి ఉన్న ఇమేజ్, సీఎం జగన్‌తో ఉన్న పరిచయం.. పార్టీలో ఉన్న పెద్దరికం వంటివి గమనించి.. వారిని తప్పించే అవకాశం లేదని.. వారిని అక్కడే కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజా, సీదిరిలను మాత్రం ఖచ్చితంగా తప్పిస్తారని.. తాజాగా తాడేపల్లి వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.