టీడీపీ వైపు వైసీపీ ఎమ్మెల్సీ చూపు..!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఏ అవకాశం ఉంటే.. ఆ అవకాశం అందిపుచ్చుకునేందుకు నాయకులు రెడీగా ఉంటారు.;
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడు ఏ అవకాశం ఉంటే.. ఆ అవకాశం అందిపుచ్చుకునేందుకు నాయకులు రెడీగా ఉంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నంలో ఉన్న టీడీపీకి వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు చిక్కారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా కోసం ఆ పార్టీ ఫైట్ చేస్తోంది. ఇది ఇస్తారో ఇవ్వరో అనేది న్యాయపోరాటంపై ఆధారపడి ఉంది.
దీంతో సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. అయితే.. ఇదేసమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీకి బలం ఉంది. మెజారిటీ శాసన మండలి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో మండలిలో ప్రభుత్వ పక్షానికి ఇబ్బందులు వస్తున్నాయి. కీలక బిల్లులు పాస్ కావడం లేదు. ఇటీవల పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు, రాజకీయ ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును వైసీపీ అడ్డుకుంది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
ఈ క్రమంలో మండలిలో బలం పెంచుకునేందుకు గత కొన్నాళ్లు వేస్తున్న వ్యూహాలకు మరింతగా పదును పెంచా రు. తమకు అనుకూలంగా ఉన్న వైసీపీ సభ్యులను తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్థాయిలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో అదే రోజు.. టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన.. వైసీపీ ఎమ్మెల్సీతో చర్చలు జరుపుతున్నట్టు తాజాగా గుంటూరు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయనే చంద్రగిరి ఏసురత్నం. ప్రస్తుతం ఈయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. తొట చందయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం తప్పుకాదని.. వ్యాఖ్యానించారు.
దీంతో ఆయనను పార్టీ మారేలా కొందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారు. 2019లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఏసురత్నం ఓడిపోయారు. గతంలో పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేసిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు కావడంతో టీడీపీకి మరింతగా కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలో వచ్చే సమావేశాల నాటికి .. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇప్పించే బిల్లును ఆమోదించేలా.. వైసీపీ నుంచి నలుగురిని తప్పిస్తే.. సరిపోతుందని అంచనా వేసుకున్న టీడీపీ ఏసురత్నం దిశగా అడుగులు వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.