వైసీపీలో బిగ్ సౌండ్ నేత రాజకీయ సన్యాసం ?

ఎపుడైతే వైసీపీ 151 సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయిందో నాటి నుంచే ఫ్యాన్ పార్టీ నేతలు ఫుల్ సైలెంట్ అయ్యారు.;

Update: 2025-05-03 14:21 GMT

వైసీపీలో నాయకులకు పదవులు ఎలా దక్కుతాయంటే అధినేత ప్రాపకం సంపాదించిన వారికి అని ప్రచారం ఉంది. వారి పనితీరు పక్కన పెడితే పార్టీ పెద్దలతో ఎంత సన్నిహితంగా ఉంటే అంతలా అందలాలు ఎక్కిస్తారు అని చెబుతారు. అలా అనేక మంది వైసీపీ అధికారంలో ఉన్నపుడు అధికార పదవులు అందుకున్నారు. ఆనాడు బిగ్ సౌండ్ చేశారు.

ఎపుడైతే వైసీపీ 151 సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయిందో నాటి నుంచే ఫ్యాన్ పార్టీ నేతలు ఫుల్ సైలెంట్ అయ్యారు. ఎవరి పనులలో వారు ఉన్నారు పార్టీని పక్కన పడేశారు అని విమర్శలు ఉన్నాయి. అలా ఒక నియోజకవర్గం కాదు అనేక నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది.

ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చూస్తే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సొంత పార్టీ క్యాడరే చెబుతోంది. అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉంటూ చక్రం తిప్పిన ఆయన ఓటమి ఎదురు కాగానే ఎందుకో కనిపించడం లేదని అంటున్నారు.

ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత దగ్గర. వైసీపీ రక్తమే తమదని ఆ కుటుంబం చెప్పుకుంటూ వచ్చింది ఆయనతో పాటు ఏకంగా కుటుంబం మొత్తం ఆనాడు అధికారాన్ని అనుభవించారు అని ఇపుడు విపక్షంలోకి పార్టీ వచ్చిన వేళ ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండడం భావ్యమా అని క్యాడర్ అంటోంది.

ఇక చూస్తే కనుక పార్టీ క్యాడర్ కి నాయకులకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుకునేందుకు నాధుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లేరని వాపోతున్నారు. అక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. అధికారం అండతో టీడీపీ దూకుడు చేస్తోంది. దాంతో వైసీపీ నాయకులు కలవరపడుతున్నారు.

ఈ సంక్లిష్ట సమయంలో మేమున్నామని చెప్పే వారు కరవు అయ్యారని అంటున్నారు. ఇక బియ్యపు మధుసూధన్ రెడ్డి స్థానికంగా ఉండడం లేదని అంటున్నారు. ఆయన కచ్చితంగా గెలుస్తాను అనుకుంటారట. అయితే జనాలు ఓడించారు అన్న ఆవేదనతో కూడిన ఆగ్రహంతోనే ఆయన ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు అని అంటున్నారు.

అయితే గెలిపించినా ఓడించినా ప్రజలే. వారి మీద కోపం తెచ్చుకుంటే నష్టం నాయకుడిదే అని అంటున్నారు. మరో వైపు చూస్తే బియ్యం మధుసూదన్ రెడ్డి రాజకీయాలకే ఒక పెద్ద నమస్కారం పెట్టేశారు అని అంటున్నారు. ఆయన అందుకే వైసీపీలో యాక్టివ్ గా లేరు అని చెబుతున్నారు.

బియ్యం మధుసూదన్ రెడ్డి పార్టీ హైకమాండ్ కి సన్నిహితంగా ఉంటూ వచ్చింది కాబట్టి అక్కడ ఇంచార్జిగా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన మాత్రం వాటిని నిర్వహించడం లేదు అని అంటున్నారు. దాంతో అక్కడ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తిరుపతి ఎంపీ గురుమూర్తి వద్దకు వెళ్తున్నారు. ఆయనే క్యాడర్ కి అండగా ప్రస్తుతం ఉంటున్నారు.

అయితే ఇలా నియోజకవర్గాన్ని వదిలేయడం మంచిది కాదని అంటున్నారు. శ్రీకాళహస్తి అత్యంత ముఖ్యమైన రాజకీయ కేంద్రంగా ఉంది. దాంతో బియ్యం తో మాట్లాడి ఆయన కాదు అంటే కనుక కొత్త వారికి చాన్స్ ఇచ్చి ఇంచార్జిని అర్జంట్ గా నియమించాల్సి ఉందని క్యాడర్ నుంచి వినిపిస్తోందిట

పార్టీ పనిచేసే వారి కోసం చూడాలి తప్ప ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచిస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుందని అంటున్నారు. రాయలసీమలో కీలకమైన నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన వాటి సంగతి ఏమిటి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News