వైసీపీలో ఎన్నో విభాగాలు...వేలాదిగా పదవులు కానీ !
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయిన పార్టీ. వైసీపీకి తెలంగాణాలో కూడా బలం ఉంది.;
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయిన పార్టీ. వైసీపీకి తెలంగాణాలో కూడా బలం ఉంది. వైసీపీ అధినేత జగన్ తెలంగాణాలో ఓదార్పు యాత్రలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఆయనకు ఈ రోజునా అక్కడ మంచి క్రేజ్ ఉంది. 2014 ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంది. ఆ తరువాత మాత్రం తెలంగాణలో పోటీ చేయలేదు, కేవలం ఏపీకే పరిమితం అయింది. ఇదిలా ఉంటే వైసీపీ ఏపీలో తన ప్రస్థానం లో రెండు సార్లు విపక్షంలో ఒకసారి అధికార పక్షంలో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా అంతా తానే అయింది. దాంతో అలా గ్రాస్ రూట్ లెవెల్ దాకా తన బలాన్ని పెంచుకుంది.
ఓటమి తరువాత :
ఏ పార్టీకి అయినా ఓటమి అతి పెద్ద దెబ్బగా చూస్తారు. వైసీపీ విషయం తీసుకుంటే 2024 ఎన్నికల్లో భారీ ఓటమి సంప్రాప్తించింది. అది కూడా అలా ఇలా కాదు, ఏకంగా 11 సీట్లకే పరిమితం అయింది. వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓట్లకు 11 సీట్లకు ఎక్కడా సంబంధం అయితే లేదు. ఏపీ అసెంబ్లీలో విపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. దాంతో వైసీపీకి ఇది భారీ షాక్ గానే అంతా భావిస్తున్నారు. వైసీపీ తిరిగి కోలుకునే తీరు ఎలా ఉంటుంది అన్నది కూడా అంతా గమనిస్తున్నారు.
ప్రస్థానం మొత్తం :
వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే ఎక్కువ కాలం విపక్షంలోనే గడిపింది. 2011లో వైసీపీని స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. విపక్షంలో తెలుగుదేశానికి పోటీగా మరో పార్టీగా వైసీపీ ఉంది. 2014లో వైసీపీ ఓడి మరో అయిదేళ్ళు విపక్ష స్థానంలో కొనసాగింది. ఇక 2019 నుంచి 2024 దాకా కేవలం అయిదేళ్ల పాటు మాత్రమే వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పటికి చూసుకుంటే వైసీపీ పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో పదేళ్ళ పాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయినట్లుగా చూడాల్సి ఉంది.
ఎన్నడూ లేని విధంగా :
ఇదంతా ఎందుకు అంటే వైసీపీకి విపక్షం కొత్త కాదు, ఆ మాట సీఎం గా తాను ఓడాక వైఎస్ జగనే మీడియాకు రిలీజ్ చేసిన వీడియో బైట్ లో చెప్పారు. అయితే గతానికి భిన్నంగా వైసీపీ ఓటమి తరువాత పార్టీ పదవులు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఇది ఒక రోజులో కాదు, ఒక్క సారిగా కాదు, అలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. వైసీపీలో ఇపుడు ఉన్నన్ని పదవులు గతంలో ఉన్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. వైసీపీకి ఒక రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఉంది. అందులో పెద్ద ఎత్తున చాలా మందికి చోటు కల్పించారు. అలాగే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అని మరో విభాగం ఉంది.
కొత్త వ్యవస్థ ద్వారా :
అందులో కూడా ఆ మధ్య పునర్ వ్యవస్థ కరీకరించి ఎక్కువ మందికి చోటు కల్పించారు. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేటర్లను కూడా పెద్ద ఎత్తున అధినాయకత్వం ఆ మధ్య నియమించింది. ఇక రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ పరిశీలకు వీటికి అదనం అన్న మాట. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయిలో అనుబంధ విభాగాలు అనేకం ఏర్పాటు చేశారు. వాటిలో ఒక్కో దానికో పెద్ద ఎత్తున పదవులు పందేరం చేశారు ఇపుడు ఆ అనుబంధ విభాగాలలో ఒక్కో దానికి ప్రాంతాల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ కొత్త వ్యవస్థను తీసుకుని వచ్చారు. అలా మహిళ, యువత, రైతు, విద్యార్ధి ఇలా అనేకం కనిపిస్తాయి.
ఫలితం ఏమిటి :
ఇంత పెద్ద ఎత్తున కమిటీలను వేసి పదవులు ఇస్తున్నారు అనేక మందిని తెచ్చి వారిలో కొత్త ఉత్సాహం నింపడానికి పదవులు అందచేస్తున్నారు. అయితే ఈ పదవులు అందుకున్న వారు ఏ మేరకు పనిచేస్తున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. పదవులు అన్నవి అలంకారం కాదు, పనిచేయడానికి బాధ్యతలు గుర్తెరిగి జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేయడానికి మరి అలా చూస్తే ఈ కమిటీలు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అన్నదే చర్చగా ఉంది. అంతే కాదు పదవులు పంచుతున్న హై కమాండ్ వారితో ఏదో ఒక సందర్భంలో మీటింగులు పెట్టి వారికి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి జనంలోకి పంపిస్తోందా దిశా నిర్దేశం చేస్తోందా చేస్తే వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏ మేరకు అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా చాలా పార్టీలకు లేని విధంగా వైసీపీలో దాదాపుగా అందరికీ పదవులు ఉన్నాయి అన్నది వాస్తవం.