వైసీపీలో పెరిగిన కాన్ఫిడెన్స్ లెవెల్స్....రీజన్ ఏంటంటే ?
ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కూటమి మీద ఏమైనా ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా ఆ ఓటు నేరుగా వచ్చి వైసీపీ బుట్టలో పడాల్సిందే.;
ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కూటమి మీద ఏమైనా ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా ఆ ఓటు నేరుగా వచ్చి వైసీపీ బుట్టలో పడాల్సిందే. ఎందుకంటే జనాలు బలమైన ఆల్టర్నేషన్ నే కోరుకుంటారు. మిగిలిన పార్టీలు ఎన్ని ఉన్నా తమ ఓటు పెద్దగా ఆ వైపు మళ్ళించరు. తమ ఓటుతో పార్టీ గెలవాలని వారు బలంగా విశ్వసిస్తారు. ఇది గత నాలుగు దశాబ్దాలుగా మారిన ట్రెండ్. దాంతో వైసీపీ వచ్చే ఎన్నికలో గెలుస్తామని ధీమా పడడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అసెంబ్లీ సెషన్ ఇచ్చిన క్లారిటీ :
తాజాగా జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వైసీపీ నిశితంగా పరిశీలించింది అని అంటున్నారు. ఈ సమావేశాలలో అధికార పక్షంలో ఉన్న కొన్ని అసంతృప్తులు బయటపడ్డాయని భావిస్తొంది అంటున్నారు. ఇవి కేవలం ప్రారంభ సూచికగా కూడా వైసీపీ చూస్తోంది. కేవలం పదిహేను నెలలు మాత్రమే అయింది కాబట్టి రానున్న కాలంలో కూటమిలో మరింతగా అసంతృప్తులు ఉంటాయని లెక్క వేస్తోంది. ఇక కూటమిలో కొందరు అయితే తమ ప్రాధాన్యతలు తగ్గడం పట్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కూటమి కూర్పు పొత్తుల మూలంగా తమ అవకాశాలు తగ్గిపోయాయని కూడా భావిస్తున్నారు అని వైసీపీ నేతలు గమనిస్తున్నారు అని అంటున్నారు.
నిజాలు బయటకు :
మరో ముఖ్య విషయం ఏమిటి అంటే వైసీపీ ఎలాంటి స్కెచ్ వేయకుండానే ఒక నింద నిజం కాదని తేలిపోయింది. మెగాస్టార్ తానుగా మాజీ సీఎం జగన్ తమను ఎంతో ఆదరించారని చెప్పడం ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారీ ఊరటగా భావిస్తోంది ఆ పార్టీ. అదే సమయంలో కూటమి తమ మీద వేసిన అనేక అభాండాలు కూడా ఇదే విధంగా దూది పింజల మాదిరిగా తేలిపోతాయని కూడా అంచనా కడుతోంది. ఇంకో వైపు చూస్తే కనుక తమ మీద జరిగిన అనేక ప్రచారాల విశ్వసనీయత మీద కూడా జనాలు ఆలోచిస్తారని ఆ విధంగా కూటమి క్రెడిబిలిటీ కూడా డౌట్ లో పడిందని వైసీపీ నేతలు భావిస్తున్నారుట.
గ్రౌండ్ లెవెల్ లో వేరేగా :
పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య ఐక్యత కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో అయితే ఒక గ్యాప్ కనిపిస్తోంది అని వైసీపీ నేతలు అంటున్నారు. వారు తమ పార్టీ అన్న గిరి గీసుకునే ఉంటారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో మరింతగా కూటమిలో చిచ్చు రేగుతుందని అది తమకు ఉపకరిస్తుందని వైసీపీ నమ్ముతోంది. దాంతో పాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా జనాలలో పెరుగుతున్న అసంతృప్తి కలసి వస్తుందని ఇంకా మూడున్నరేళ్ళ కాలం ఉంది కాబట్టి ఆనాటికి చేయాల్సిన తప్పులు కూటమి చేస్తుందని అలా అధికారం తమ ఒడిలోకి వచ్చి పడుతుందని కూడా లెక్క వేసుకుంటోంది అంటున్నారు.
క్యాడర్ లో జోష్ :
గతంతో పోలిస్తే క్యాడర్ తో జోష్ పెరుగుతోంది అని అంటున్నారు. ఈ చిన్న అంశం మీద అయినా వారికి వారే ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు అని పార్టీ పెద్దలు గుర్తిస్తున్నారు. అంతే కాదు గతంలో పార్టీ పరంగా పెద్దగా యాక్టివ్ గా లేని లీడర్స్ ఇపుడు ముందుకు వస్తున్నారు ఇది శుభ పరిణామం అని అంటున్నారు. మొత్తానికి చూస్తే తాజాగా జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పెట్టి దిశా నిర్దేశం చేయడం డిజిటల్ బుక్ ఓపెన్ చేయడంతో పాటుగా వరసగా సాగుతున్న పరిణామాలు వైసీపీకి మంచి రోజులు వస్తాయన్న భావన కలిగిస్తున్నాయని అంటున్నారు.