అసెంబ్లీకి వైసీపీ- నిర్ణయం అదేనా ?

అదే శాసన మండలిలో మాత్రం మొత్తం అంతా హాజరయ్యారు. దాంతో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అని అంటున్నారు.;

Update: 2026-02-12 16:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తున్నారా ఈసారి బడ్జెట్ సమావేశాలు హీటెక్కిస్తాయని వైసీపీ అధినేత జగన్ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు అపొజిషన్ బెంచీలలో కనిపిస్తారని చాలా ప్రచారం సాగింది. అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేసిన తొలి రోజున మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. రెండో రోజు యధా ప్రకారం అసెంబ్లీ మొదలైంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు, అదే శాసన మండలిలో మాత్రం మొత్తం అంతా హాజరయ్యారు. దాంతో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అని అంటున్నారు.

ప్రతిపక్ష హోదా కోసం :

ఇక వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అధినేత జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గట్టిగా ప్రశ్నించాలని జగన్ సూచించినట్లుగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మీడియాకు చెప్పారు. అదే విధంగా అసెంబ్లీలో మాత్రం వైసీపీ హాజరయ్యేది లేదన్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం బెదిరిపోతోంది అని లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. తమకు హోదా ఇస్తే అధికార పక్షం వైఫల్యాలను వెలికి తీస్తామని భయం అని ఆయన విమర్శించారు.

రానట్లే లెక్క :

దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానట్లుగానే లెక్క వేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ప్రభుత్వం వైపు చెబుతున్నారు. హోదా ఇస్తేనే తప్ప తాము హాజరు కామని వైసీపీ అంటోంది. గత ఇరవై నెలలుగా ఇదే తీరున వ్యవహారం సాగుతోంది. కానీ ఇప్పుడు బడ్జెట్ సెషన్ కారణమగా ఏమైనా మారుతుందా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగింది. కానీ అలా జరిగే అవకాశాలు ఏ మాత్రం లేవని తేలిపోతోంది.

ఏకపక్షంగానే :

దీంతో అసెంబ్లీ అంతా కూటమి ఎమ్మెల్యేలతో ఏకపక్షంగానే సాగనుంది. వైసీపీ వైఖరి ఊహించినట్లుగానే జరుగుతోంది అని అంటున్నారు. ఇక కూటమి తరఫున ఉన్న మూడు పార్టీల ఎమ్మెల్యేలే ప్రజా సమస్యలు లేవనెత్తాలని కూటమి పెద్దలు ఇప్పటికే కూటమి సమావేశంలో చెప్పుకొచ్చారు అధికార ప్రతిపక్ష బాధ్యతలను వారే నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పదిహేడు రోజుల పాటు సాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనేక బిల్లులు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

వైసీపీ స్టాండ్ తో :

ఇక వైసీపీ అసెంబ్లీకి హాజరు కాకూడదు అన్న నిర్ణయం తీసుకుంటే కనుక అది ఆ పార్టీకి మేలు చేస్తుందా లేక మైనస్ అవుతుందా అంటే దీని మీద విశ్లేషణ అయితే సాగుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఉండాలని అధికార పక్షాన్ని నిలదీసి ప్రజా సంస్యల మీద పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే కనుక వైసీపీకి ఇది మైనస్ అవుతుందని అంటున్నారు. అయితే తాను ప్రజా క్షేత్రంలో నిలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ చెబుతోంది. అంతే కాకుండా శాసనమండలిలో తమ పార్టీ గట్టిగా పోరాడుతోందని చెప్పుకుంటోంది. మొత్తానికి వైసీపీ అసెంబ్లీకి రావడం ఒక రోజు ముచ్చటేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News