వైసీపీలో చర్చ : ఒకనాడు వెలుగు...ఇపుడు కనుమరుగు

ఒక విధంగా జనాలతో కూడా మంచి సంబంధాలు నెరిపితే జిల్లా స్థాయి నాయకులుగా చలామణీ అయ్యేంత చాన్స్ ఉంది.;

Update: 2025-07-12 04:12 GMT

వైసీపీలో ఎంపీలుగా ఒకనాడు వెలుగు వెలిగిన వారు ఇపుడు కనుమరుగు అయ్యారు. ఎంపీ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నెగ్గిన వారు. ఆ ఏడు నియోజకవర్గాల ప్రజలు ఓటేస్తే పార్లమెంట్ కి వెళ్ళిన వారు. విశాలమైన పరిధితో పాటు లక్షలలో ప్రజలతో పరిచయాలు ఉన్న వారు. ఎంపీ అంటే కీలక పదవి. పెద్ద బాధ్యత.

ఒక విధంగా జనాలతో కూడా మంచి సంబంధాలు నెరిపితే జిల్లా స్థాయి నాయకులుగా చలామణీ అయ్యేంత చాన్స్ ఉంది. వైసీపీకి 2019 ఎన్నికల్లో ఏకంగా 22 మంది ఎంపీలు గెలిచారు. వారిలో ఎక్కువ మంది కొత్త వారు, పెద్దగా జన బాహుళ్యం తో పరిచయం లేని వారు కూడా వైసీపీ ప్రభంజనంతో ఒక్కసారిగా గెలిచి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు.

అలా అయిదేళ్ళ పాటు తమ అధికారాన్ని చలాయించిన వారు ఇపుడు వైసీపీ విపక్షంలో ఉన్న వేళ ఎక్కడ అన్న ప్రశ్న వస్తోంది. ఉత్తరాంధ్రా విషయానికి వస్తే విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు నుంచి ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. అయిదేళ్లు ఆయన ఎంపీగా తన హవా చాటారు. 2024లో ఆయన విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. టీడీపీ వేవ్ లో భారీ ఓటమిని అందుకున్నారు. ఆ వెంటనే రాజకీయాలకు దూరంగా జరిగారు.

ఆయన వైసీపీలో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఈ మధ్యనే జగన్ రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన తమ నాయకులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది అని చెబుతూ ఎంవీవీ పేరు కూడా చెప్పారు. ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నట్లుగా అధినేత భావిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఏడాదిగా కనిపించడం లేదని పార్టీవారే అంటున్నారు.

మరో వైపు చూస్తే అనకాపల్లి నుంచి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచిన భీశెట్టి సత్యవతి కూడా వైసీపీ సమావేశాలలో కనిపించడం లేదు. అంతే కాదు ఆమె ఎక్కడా రాజకీయంగా ప్రకటనలు చేయడంలేదు. వృత్తి రిత్యా వైద్యురాలిగా ఉన ఆమెకు ఎంపీ పదవి ఒక మంచి అవకాశంగా దక్కింది. ఆమె సామాజిక సేవా బాధ్యతలు కూడా చూసేవారు దాంతో ఆమెకు లాస్ట్ మినిట్ లో వైసీపీ టికెట్ దక్కింది. ఆమె కూడా అనూహ్యంగా విజయం అందుకున్నారు. ఇక ఇపుడు ఆమె రాజకీయాల వైపు చూడటం లేదు అని అంటున్నారు.

అదే విధంగా అరకు నుంచి ఒకసారి ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధవి కూడా ఇపుడు అంతగా పార్టీలో కనిపించడం లేదు ఆమె రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లేనా అన్నది కూడా చర్చగా ఉంది. వీరే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల కొత్త వారిని తెచ్చి ఎంపీలుగా పోటీ చేయించారు. రాజమండ్రీ సీటుకు ఒక డాక్టర్ గారిని పోటీకి నిలిపారు. ఓటమి తరువాత మాత్రం కొత్తవారు అంతా కనుమరుగు అయ్యారని అలాగే చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తరఫున రాజకీయ వేదిక ఎక్కి కూటమికి ఎదురు నిలిచేందుకు కూడా సంశయిస్తున్నారు అని అంటున్నారు.

దీంతో వైసీపీలో కూడా ఒక చర్చ సాగుతోంది. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు అందే వృత్తిగా చేసుకున్న వారికి టికెట్లు ఇస్తే ఓటమి పాలు అయినా జనంలో ఉంటారని అలా కాకుండా ప్రయోగాలు చేస్తే పార్టీ కష్టకాలంలో ఉంటే ఇలాగే జరుగుతుందని అంటున్నారు మరి వైసీపీకి ఇవన్నీ రాజకీయ పాఠాలే అని అంటున్నారు. వీటి నుంచి పార్టీ నేర్చుకుని ముందు ముందు ఎలా వ్యవహరిస్తుంది అన్నదే అంతా చూస్తున్నారుట.

Tags:    

Similar News