ఉత్త‌రాంధ్ర వైసీపీలో జోరేది జ‌గ‌న‌న్నా ..!

నిజానికి ఉత్తరాంధ్రలో నాయక బలం, కార్యకర్తల బలం బాగానే ఉన్నప్పటికీ పార్టీ పరంగా నడిపించే వ్యక్తులు యాక్టివ్గా లేకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి పరిస్థితి ఇబ్బందిగా మారింది.;

Update: 2025-06-15 16:30 GMT

ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదు. నిజానికి ఉత్తరాంధ్రలో నాయక బలం, కార్యకర్తల బలం బాగానే ఉన్నప్పటికీ పార్టీ పరంగా నడిపించే వ్యక్తులు యాక్టివ్గా లేకపోవడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి పరిస్థితి ఇబ్బందిగా మారింది. గడిచిన ఐదు సంవత్సరాలలో ఉత్తరాంధ్ర నుంచి పలువురు నాయకులు మంత్రులుగా, తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ప‌నిచేశారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు మంత్రులుగా కీలక పాత్ర పోషించారు. అయితే పార్టీ ఓటమి దరిమిలా ఇప్పటివరకు వైసీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు నిర్వహించింది లేదు.

పైగా ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీని వేడి వెళ్లిపోవడం కూడా ఉత్తరాంధ్ర రాజకీయాలపై ప్రభావం చూపించింది. ప్రధానంగా విశాఖపట్నంలో వైసిపి మాట ఇటీవల కాలంలో పెద్దగా వినిపించడం లేదు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా కీలక నాయకులు యాక్టివ్గా ఉండడం లేదన్నమాట వినిపిస్తోంది. ఇక శ్రీకాకుళం లో ధర్మాన సోదరులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు ఉన్నప్పటికీ ఆయనను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.

పార్టీలో కూడా అంతర్గత విభేదాలు కారణంగా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక విజయనగరానికి వచ్చేసరికి మాజీ మంత్రి బొత్స‌ సత్యనారాయణ బాక్స‌ర్ మాదిరిగా చెల‌రేగుతార‌ని, కీలకంగా ఉంటార‌ని అనుకున్నా ఆయన ఎక్కువగా రాజధాని ప్రాంతంలో మాత్రమే రాజకీయాలు చేయడానికి పరిమితం అవుతున్నారు. లేదా ఆయనకి కేటాయించిన జిల్లాకు మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారు. దీంతో ఒక రకంగా చెప్పాలంటే రాజధాని ప్రాంతంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం పార్టీ ఇబ్బందుల్లోనే ఉందని చెప్పాలి.

ఫలితంగా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ తరఫున నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు కానీ పెద్దగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపించడం లేదు. దీంతో కేడర్ కూడా పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు ఏడాది అయినా ఇప్పటికీ ఇంకా వైసీపీ నాయకులు పుంజు కాకపోవడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల మధ్యకు రాకపోవడం అంటివి రాజకీయంగా ఉత్తరాంధ్రలో వైసీపీని ఇరకాటంలో పెట్టాయ‌నే చెప్పాలి. మరి మున్ముందైన పుంజుకుంటుందో లేదో.. నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News