ఒక్క సారి అరెస్టు అయితే ఇక అంతేనా.. కేసుల ఉచ్చులో వైసీపీ నేతలు
ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుంచి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు.;
ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుంచి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే కొందరు బెయిల్ పై బయట ఉండగా, బెయిలు దక్కని వారు అరెస్టు అవుతున్నారు. అయితే ఇలా అరెస్టు అయిన వారిపై మరిన్ని కేసులు నమోదు చేస్తూ వారు బయటకు రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరుస కేసులతో విపక్షాన్ని అతలాకుతలం చేస్తున్న అధికార పార్టీ వ్యూహం సరైనదా? కాదా? అన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ వ్యవహారశైలిని విపక్షం సూటిగా విమర్శిస్తోంది. అయితే తమ నేతలను కేసుల నుంచి బయటపడేసే అంశంలో మాత్రం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయిందని అంటున్నారు.
ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది. ఆ తర్వాత మైనింగు డైరెక్టర్ వెంకటరెడ్డిని కటకటాల వెనక్కి నెట్టింది. అయితే ఈ రెండు అరెస్టులు వైసీపీని ఇండైరెక్టుగా ఇబ్బంది పెట్టినా, ఆ పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఎక్కడ ఆందోళన కనిపించలేదు. కానీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న వల్లభనేని.. ఆ కేసు నుంచి బయటపడే మార్గంలో అనూహ్యంగా కిడ్నాప్ కేసులో చిక్కుకున్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం పకడ్బందీ వ్యూహరచనతో ఆయనపై దాదాపు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒకదాంట్లో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేయడంతో ఆయన దాదాపుగా నాలుగు నెలలుగా జైలు జీవితమే గడపాల్సివస్తోంది.
వల్లభనేని వంశీయే కాకుండా వైసీపీ నేతలు, ఆ పార్టీకి సానుభూతి పరులుగా వ్యవహరించిన పలువురిపై ఇదే విధమైన వ్యూహం అమలు చేస్తోంది ప్రభుత్వం. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపైనా కేసుల ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఒక కేసులో రిమాండు ఖైదీగా ఉన్న కాకాణిపై తాజాగా మరో కేసు నమోదు చేయడం, పాత కేసుల బూజు దులుపుతుండటంతో ఆయనను ఇప్పట్లో విడిచిపెట్టే ఆలోచన లేనట్లుగా చెబుతున్నారు.
సినీ నటుడు పోసాని, సోషల్ మీడియా యాక్టివిస్టు బోరుగడ్డ, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా ఇదే విధంగా ఒక కేసులో జైలుకు వెళ్లి.. ఆ తర్వాత వరుస కేసులతో జైలులోనే గడపాల్సివస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి పోసాని బెయిల్ పై బయటకు వచ్చినా, ఆ తర్వాత సైలెంటు అయిపోవడంతో ప్రభుత్వ వ్యూహం ఫలమిస్తుందని చెబుతున్నారు. దారికొస్తే ఒకలా? లేదంటే మరో లా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వల్లభనేని మాదిరిగానే సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులుపైనా పలు కేసులు నమోదు చేసి బయటకు రాకుండా చేస్తున్నారని అంటున్నారు.
ఇలా వరుస కేసులు నమోదు చేయడం వల్ల వైసీపీ నేతలను మానసికంగా దెబ్బతీయడమే కూటమి ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే పార్టీ నేతలపై నమోదు అవుతున్న కేసులను అడ్డుకోవడంలో వైసీపీ విఫలమవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రధానంగా అరెస్టు కాకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే అరెస్టు అయిన తర్వాత మరిన్ని కేసులు నమోదు కాకుండా అడ్డుకోవడం అతిపెద్ద సవాల్ గా మారుతుందని అంటున్నారు.