కమల్ తప్పులు...విజయ్ దిద్దుబాట్లు

సాధారణంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళే వారు రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటారు.;

Update: 2026-05-04 19:30 GMT

రాజకీయాలే కాదు ఏ రంగంలో అయినా విజయానికి కావాల్సింది వ్యూహాలు. అంతే కాదు తప్పులు పొరపాట్లు చేయకుండా ముందుకు సాగడం. ప్రజలతో ముడిపడి ఉన్న రాజకీయ రంగంలో అయితే ఏది చేసినా జనాలు కోటి కళ్ళతో చూస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తన ముందు వారు మరీ ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చేసిన తప్పులను టీవీకే అధినేత విజయ్ చాలా నిశితంగా పరిశీలించారని అంటున్నారు. అందుకే ఆ తప్పులను చేయకుండా తనను తాను దిద్దుకుంటూ ముందుకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఈ రోజున అపూర్వమైన విజయం ఆయనకు అందించింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రెండు పడవల్లో కాళ్ళు :

సాధారణంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళే వారు రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ ఉంటారు. చేతిలో ఉన్న సినిమాలను వారు అసలు వదులుకోలేరు. అదే సమయంలో ప్రజా జీవితం అంటే ఎంతో బిజీగా ఉంటుంది. అసలు తీరిక లేని వ్యవహారంగా కూడా ఉంటుంది. అలాంటి రంగంలో పూర్తి సమయం ఇవ్వకపోవడం కూడా జనం మీద అతి పెద్ద ప్రభావం చూపుతుంది. తాము ప్రజల కోసమే అని చెప్పినా కూడా వారితో మమేకం కాకపోతే జనాలు ఆ మాటలను పెద్దగా విశ్వసించే అవకాశాలు అయితే ఉండవు. చాలా మంది ఇక్కడే పప్పులో తప్పులో కాళ్ళు వేసి భంగపడ్డారు. ఇక తమిళనాడులో విజయ్ కంటే అయిదేళ్ళ ముందే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2021 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని అందుకున్న విశ్వ నటుడు కమల్ హాసన్ చేసిన పొరపాట్లు విజయ్ చేయకపోవడం వల్లనే ఆయనని ఈ విజయం వరించింది అని అంటున్నారు.

ఫుల్ ఫోకస్ అక్కడే :

కమల్ హాసన్ విషయమే తీసుకుంటే ఆయన సినిమాలూ రాజకీయాలూ రెండింటినీ కో ఆర్డినేట్ చేసుకోలేకపోయారు అని అంటున్నారు. ఆయన ఎక్కువ సమయం రాజకీయాలకు ఆ విధంగా ఇవ్వలేకపోయారు అని అంటున్నారు. అదే విజయ్ అయితే తన సినిమాలను 2024 లో ఆపేశారు. జన నాయకన్ చివరి సినిమా అని ప్రకటించి ఆ మాటకు కట్టుబడి పోయారు. అంతే కాదు పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం క్యాడర్, లీడర్లతో సమావేశాలు జరపడం, జనాలు మీటింగులు ప్రజల సమస్యలు వాటి మీద ఫుల్ ఫోకస్ పెడుతూ ముందుకు సాగారని అంటున్నారు. అవే ఈ రోజున విజయ్ పార్టీని విజయ తీరాలకు చేర్చాయని గుర్తు చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పాయింట్ నే గుర్తు చేసి మరీ రాజకీయాల పట్ల విజయ్ అటెన్షన్ ఫోకస్ ని మెచ్చుకుంటున్నారు.

క్షేత్ర స్థాయి నుంచి :

అందరూ విజయ్ పార్టీ కొత్తది అని అనుకున్నారు. బలం ఎక్కడిది అని కూడా భావించారు. అయితే తన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్ట్రక్చర్ తో రూపు దిద్దుకునేలా చేయడంలో విజయ్ గడచిన రెండేళ్ళుగా అండర్ గ్రౌండ్ లో సూపర్ వర్క్ చేసారని ఎవరూ అనుకోలేకపోయారు. ఆ దిశగా ఆలోచించలేకపోయారు. కానీ డీఎంకే అన్నా డీఎంకే కు ధీటుగా విజయ్ పార్టీ నిలబడి గెలిచింది అంటే దానికి పార్టీ నిర్మాణం మీద విజయ్ పూర్తిగా శ్రద్ధ పెట్టడమే కారణమని అంటున్నారు. అలా కమల్ సహా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చేసిన తప్పులను గమనించి విజయ్ తన టీవీకే పార్టీని పూర్తిగా చక్క దిద్దుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News