యథావిధిగా డుమ్మా.. వైసీపీ అధినేతలో మార్పు రాదా?
వైసీపీ గతంలో విద్యార్థుల సమస్యపై ఫీజు పోరు అనే కార్యక్రమం నిర్వహించింది. అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునిచ్చింది.;
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధినేత పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కేడర్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే, అధినేత జగన్ ఇంటికే పరిమితమైపోవడం, కనీసం కార్యక్రమం ఎలా జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని క్షేత్రస్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధినేత ఎక్కడో ఒక చోట పాల్గొంటే కార్యకర్తలకు మరింత ఉత్సాహం వచ్చేదని, కానీ ఆయన అలా చేయకుండా ఎప్పట్లానే ఇంటికే పరిమితమైపోవడంపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. జగన్ తోపాటు అధిష్టానం ముఖ్యులు ఎవరూ ఈ ఆందోళనల్లో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నందున అధినేత ముందుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే కేడర్ లో మరింత ఉత్సాహం వస్తుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ, మాజీ సీఎం జగన్ ఆందోళనలకు పిలుపునివ్వడమే కానీ, ఆయన దూరంగా ఉంటూ వస్తుండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వైసీపీ పలు ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో ఏ ఒక్క కార్యక్రమానికి జగన్ హాజరుకాలేదని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఎదురవుతున్న విమర్శలకు తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని కొందరు నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ గతంలో విద్యార్థుల సమస్యపై ఫీజు పోరు అనే కార్యక్రమం నిర్వహించింది. అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ‘వెన్నుపోటు దినం’గా పరిగణించాలని ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. అదేవిధంగా విద్యుత్ చార్జీలు భారంగా మారాయని కూడా ఓ ఆందోళన చేసింది. అయితే ఈ కార్యక్రమాల్లో ఒక్క దాంట్లో కూడా జగన్ కానీ, అధిష్టానం పెద్దలు కానీ పాల్గొనలేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో పార్టీ అధినేతపై గౌరవంతో ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో కేడర్ రోడ్డెక్కుతున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని దాటుకుని తామంతా రోడ్డెక్కుతుంటే, అధినేత జగన్ మాత్రం ఇంటికి పరిమితవడం వల్ల ఆందోళనలపై ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు. ప్రతిపక్షం గళాన్ని ఎంత గట్టిగా వినిపించినా, జగన్ మిస్ అయితే విలువ ఉండటం లేదన్న చర్చ నడుస్తోంది. జగన్ రోడ్డెక్కితే వచ్చే స్పందనకు తాము చేసే ఆందోళనలకు చాలా ఉంటుందని కొంతమంది సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అధినేత ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపితే బాగుంటుందని అంటున్నారు. కానీ, అధినేత తీరులో ఇప్పటికీ మార్పు రావడం లేదని వాపోతున్నారు. అధికారం కోల్పోయి 18 నెలలు అవుతోందని, అధినేత బయటకు వస్తేనే పార్టీ బలపడే అవకాశం ఉంటుందని తెగేసి చెబుతున్నారు.