జంపింగ్ లీడర్స్ తాజా రాజకీయం ఎలా ఉంది.. కొత్త పార్టీలో అంతా సెట్ అయినట్లేనా?

వైసీపీలో ఉండగా, మంత్రిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని ఇప్పుడు పెద్దగా హడావుడి చేయడం లేదు.;

Update: 2025-07-01 15:30 GMT

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే కొనసాగుతాయి. ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరాటం ఉండటంతో నిత్యం ఎన్నికల దృష్టితోనే అగ్రనేతలు పావులు కదుపుతుంటారు. ఎన్నికలు అయి ఏడాది కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఏడాదిలో చేసింది చెప్పుకోవాలని అధికారపక్షం, చెప్పినవి చేయలేదని విపక్షం ప్రజల్లోకి వెళుతుంది. అయితే ఇలా ఇరుపార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అవుతుండగా, విపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చిన కొందరు నేతల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా తయారైందని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన కొందరు నేతలు పార్టీ ఓటమితో కొద్ది రోజుల్లోనే అధికార పక్షంతో చేతులు కలిపారు. ఇలాంటివారిలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను పేర్లు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు వదులుకుని అధికార పార్టీలో చేరిన ఈ నేతల్లో సామినేని ఉదయభాను మినహా మిగిలిన వారు ఆయా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో ఉండగా, మంత్రిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని ఇప్పుడు పెద్దగా హడావుడి చేయడం లేదు. ప్రస్తుతం జనసేనలో ఉన్న ఆయనను కలుపుకుని వెళ్లేందుకు ఒంగోలు టీడీపీ నేతలు ఇష్టపడటం లేదని అంటున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో బాలినేని ఎక్కడా కనిపించడం లేదు. బాలినేని అధికార పార్టీలో ఉండగా, ఆయన లేని ప్రభుత్వ కార్యక్రమం జరిగేది కాదు. కానీ, ఇటీవల రియలన్స్ బయో గ్యాస్ ప్లాంట్ల శంకుస్థాపనకు మంత్రి లోకేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించగా, ఆ కార్యక్రమంలో బాలినేని కనిపించలేదని చెబుతున్నారు. కేవలం ఆయన జనసేన కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని అంటున్నారు.

అదేవిధంగా ఏలూరుకు చెందిన మరో మాజీ మంత్రి ఆళ్ల నాని రాజకీయ భవిష్యత్తుపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా, ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ ఓడిన తర్వాత వైసీపీ కార్యాలయం బోర్డు పీకేసిన నాని టీడీపీలో చేరిపోయారు. ఆయన చేరికను ఏలూరు టీడీపీ కేడర్ మొత్తం వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు మాత్రం అందరినీ ఒప్పించి నాని రాకను స్వాగతించారు. అయితే టీడీపీ చేరిన తర్వాత నాని సైలెంట్ అయిపోవాల్సివచ్చిందని అంటున్నారు. చంద్రబాబు ఒత్తిడితో నాని ఎంట్రీకి కేడర్ అంగీకరించినా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను పిలవడం లేదని చెబుతున్నారు. దీంతో నాని అధికార పార్టీలో ఉన్నా గుర్తింపు దక్కడం లేదని ఆవేదనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా ఘోరంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుని టీడీపీలో చేరారు. అయితే ఆయనతోపాటు టీడీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు రాజ్యసభ స్థానాన్ని రెన్యువల్ చేసిన టీడీపీ.. మోపిదేవిని మాత్రం వదిలేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పదవి లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మోపిదేవి 2014లో ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చారని, ఆ తర్వాత రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టారని గుర్తుచేస్తున్నారు. అయితే అవన్నీ కాదనుకుని టీడీపీలోకి వెళ్లిన మోపిదేవి ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారని అంటున్నారు.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పరిస్థితి ఉందని అంటున్నారు. వీరందరిలో కల్లా జనసేన జిల్లా అధ్యక్ష బాధ్యతల వల్ల సామినేని ఉదయభాను మాత్రమే ప్రజల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ నెలలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఏదో ఒక కారణంతో ప్రజల్లోకి వెళుతుండగా, ఏడాది క్రితం వరకు నిత్యం ప్రజల మధ్య ఉన్న ఈ వలస నేతలు ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిరావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News