లోకల్ టాక్: ఓడారు.. నియోజకవర్గాన్ని వీడారు.. !
గత ఎన్నికల సమయంలో చాలా మంది వైసీపీ నాయకులు ఓడిపోయారు. అయితే.. ఎన్నికల సమయం లో చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల సమయంలో చాలా మంది వైసీపీ నాయకులు ఓడిపోయారు. అయితే.. ఎన్నికల సమయం లో చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యే ఉంటామన్నారు. నిజానికి గెలుపు- ఓటములు అనేవి.. ఎన్నికల రాజకీయాల్లో సహజం. ఆ సమయానికి ప్రజలు తీసుకున్న నిర్ణయమే శిరోధా ర్యం. అయితే.. వైసీపీలోని అందరి విషయాన్నీ పక్కన పెడితే.. కొందరు నాయకులు మాత్రం.. ఓడిపోయి న తర్వాత తమ నియోజకవర్గాలను మరిచిపోయారన్న వాదన వినిపిస్తోంది.
వీరిలో కీలక నేతలను గమనిస్తే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంనుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయారు. వాస్తవానికి ఆయన అదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. కానీ.. ఓడిపోయిన తర్వాత.. ఆయన ఒక్కసారి కూడా నియోజకవర్గం ముఖం చూడకపోవడం గమనార్హం. కేవలం హైదరాబాద్‌లోనే ఉండి.. మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు.
వైసీపీ ముఖ్య నేత.. గతంలో కీలక పాత్ర పోషించిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇదే తంతుగా ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఇవ్వలేదు. దీంతో అలిగి కాంగ్రెస్ గూటికి వెళ్లినా.. మళ్లీ తిరిగివచ్చారు. కానీ, నియోజకవర్గంలో ఎక్కడా ఆయన అజా కనిపించడం లేదు. కనీసం ఉలుకు పలుకు కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొందరు రాజధాని రైతులు.. ఆయ నను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయన స్పందించకపోవడం గమనార్హం.
గత ఎన్నికల్లో పోటీ చేసిన బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి పేరుంది. అయితే.. ఆమె కూడా ఓడిపోయిన తర్వాత.. ఎక్కడా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలోని ఇతర నేతల రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయి. అయితే.. ఎవరు ఎలా ఉన్నా.. ప్రజలను కలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ధర్మాన ప్రసాదరావు కూడా.. కేవలం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా.. ప్రజలను కలుసుకుంటే అది వచ్చే ఎన్నికలకు మేలు చేస్తుందన్న చర్చ ఉన్నా.. నాయకులు మాత్రం తమ సొంత వ్యవహారాలకే పరిమితం అవుతున్నారు.