బాబు పవన్ విషయంలో టోన్ మార్చిన వైసీపీ

వైసీపీ టోన్ మార్చింది. కొత్త స్వరం అందుకుంటోంది. తనది కాని రాగం పాడుతోంది.;

Update: 2025-10-29 03:42 GMT

వైసీపీ టోన్ మార్చింది. కొత్త స్వరం అందుకుంటోంది. తనది కాని రాగం పాడుతోంది. అయితే అది పార్టీ వ్యూహమా లేక రాజకీయ అనివార్యత అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ ఏపీలో టీడీపీ కూటమి విషయంలో వైసీపీ మార్చుకున్న స్టాండ్ ఏమిటి ఆ పార్టీ కొత్త టోన్ ఎలా ఉంది అన్నది చూడబోతే ఆసక్తికరమే అని చెప్పాలి. ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం కూటమి కట్టడం అన్నది ఒక నిఖార్సైన రాజకీయ విశ్లేషణ. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు వేరు వేరుగా పోటీ చేశాయి. అపుడు 151 సీట్లతో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. కానీ 2024లో మాత్రం కూటమి కట్టి అంతా ఒక్కటి కాగానే వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో వైసీపీ నుంచి ఏ స్వరం రావాలంటే కూటమి విడిపోవాలనే అంతా అనుకుంటారు. అది వైసీపీ కొత్తలో ప్రయత్నం చేసిందని రాజకీయంగా వ్యూహాలు కూడా ఎన్నో వేసిందని చెప్పుకున్నారు.

పదిహేనేళ్ళ పాటకు :

ఇక ఇపుడు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు కూటమి పార్టీలు కలసి ఉంటాయని గట్టిగా చెబుతున్నారు. ఆయన ఒక్కసారి కాదు పదే పదే చెబుతున్నారు. ఏపీ అభివృద్ధి సాధించాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాల్సిందే అన్నది పవన్ ఆలోచన. అదే ఆయన చాలా ఓపెన్ గా చెబుతున్నారు ఈ మధ్యనే కర్నూల్ లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలోనూ చెప్పారు. గతంలో అయితే వైసీపీ ఈ తరహా వ్యాఖ్యల మీద విమర్శలు చేసేది కానీ ఇపుడు కొత్త రకంగా రియాక్ట్ అవుతోంది.

ఫెవికాల్ బంధమంటూ :

తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి పార్టీలది ఫెవికాల్ బంధం అని సెటైర్లు వేశారు. ఆ బంధాన్ని మీరు విడదీస్తున్నారుట అని యాంకర్ అడిగిన దానికి ఆయన వేరే విధంగా రియాక్ట్ అయ్యారు. తాము ఎందుకు విడదీస్తామని ఎదురు ప్రశ్నించారు. అంతే కాదు తాము విడదీయాలనుకున్న వీడేది కాదని అది ఫెవికాల్ బంధం అని అన్నారు కలసి ఉంటేనే తాము గెలుస్తామని వారి నమ్మకం అని అలాగే కానీవ్వడని జోగి రమేష్ అన్నారు. అదే సమయంలో తాము కూడా అలాగే వారంతా కలసి ఉండాలని 2029 ఎన్నికల్లో అలాగే ఒక్కటిగా రావాలని బలంగా కోరుకుంటున్నామని జోగి రమేష్ అనడం విశేషం.

వైసీపీ విశ్లేషణ ఇదేనా :

కూటమి కట్టినా ఈసారి గెలిచేది వైసీపీయే అని జోగి రమేష్ గట్టిగా చెబుతున్నారు. దానికి కారణాలు ఆయన విశ్లేషించారు. బాబు పవన్ కలిసి ఉండొచ్చు. వారి మధ్య మంచి బంధం ఏర్పడవచ్చు. కానీ ఆయా పార్టీల క్యాడర్ కలిసి లేదు కదా అని ఆయన అంటున్నారు కూటమిలో కుమ్ములాటలు గ్రౌండ్ లెవెల్ లో పెద్ద ఎత్తున ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అంతే కాదు జనాలు కూడా 2024 లో కూటమిని గెలిపించారు ఈసారి వారు ఎందుకు ఆ వైపు చూస్తారని ప్రశ్నించారు. బలమైన సామాజిక వర్గంలో కూడా ఈసారి మార్పు వస్తుందని జనసేన వైపు కాకుండా వైసీపీ వైపు వారు చూస్తారని జోగి రమేష్ నమ్మకంగా చెబుతున్నారు.

వ్యూహం గెలుస్తుందా :

నాయకులు కలసినంత మాత్రాన ప్రజలు కలవాలని లేదు, వారు ప్రభుత్వం చేసే మంచి చెడులను చూస్తారని ఆ విధంగా చూస్తే ఇప్పటికే కూటమి మీద అసంతృప్తి మొదలైందని అందువల్ల వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఇక ఒక బలమైన సామాజిక వర్గం పవన్ సీఎం అవుతారని ఓటేసిందని అయితే ఆయనే పదిహేనేళ్ల పాటు కూటమి ఉండాలని అంటూంటే ఎందుకు ఓటేస్తారని లాజిక్ గా ప్రశ్నించారు. అంతకు ముందు ఇదే మాటను మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అన్నారు. బాబు పవన్ కూటమి కట్టి వస్తేనే తాము ఓడిస్తామని విడిగా ఓడిస్తే మజా ఏముందని ఆయన కూడా అన్నారు. సో మరి ఇలా జరుగుతుందా వైసీపీ తర్కం వ్యూహం గెలుస్తుందా అంటే 2029 దాకా వెయిట్ చేయాల్సిందే మరి.

Tags:    

Similar News