బోరుగడ్డతో భలే తమాషా.. ఉలిక్కిపడిన వైసీపీ!
గుంటూరుకు చెందిన రౌడిషీటర్, వైసీపీ సానుభూతిపరుడిగా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమారుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది.;
గుంటూరుకు చెందిన వైసీపీ సానుభూతిపరుడిగా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమారుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలో ఉండగా బోరుగడ్డ సోషల్ మీడియా ఇంటర్వ్యూలు, అతడి ప్రవర్తన పట్ల మౌనం వహించిన వైసీపీ పార్టీ.. తాజాగా అతడు ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఉలిక్కిపడింది. బోరుగడ్డ మాటలను తేలిగ్గా వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న భావనకు వచ్చిన వైసీపీ.. అతడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గురువారం సాయంత్రం ప్రకటించింది. అయితే వైసీపీ ప్రకటన చేయడానికి దారి తీసిన పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైసీపీ అధికారంలో ఉండగా, తాను ఆ పార్టీకి సానుభూతిపరుడిగా బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పుకునేవాడు. రిపబ్లికన్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే శిష్యుడిగా చెప్పుకుంటూ బోరుగడ్డ రాష్ట్రంలో అనేక వ్యవహారాలు చేశాడు. అయితే అన్నింటికంటే ఎక్కువగా మాజీ సీఎం జగన్ వీరాభిమాని అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోయేవాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి తన అభిమాన నేత జగన్ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. అయితే బోరుగడ్డ అలా రెచ్చిపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం ఎదురైందనే విశ్లేషణలు ఉన్నాయి.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డను అరెస్టు చేశారు. దాదాపు ఏడు నెలలు జైలులో పెట్టారు. రాష్ట్రంలో దాదాపు 50 కేసలు నమోదు చేయడమే కాకుండా, రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిప్పుతూ బోరుగడ్డకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇంత కఠినంగా వ్యవహరించినా ఎవరూ సానుభూతి కూడా చూపలేదు. వైసీపీ నేతలు కూడా అతడికి విధించిన శిక్షపై లోలోన ఆనందించారని అంటున్నారు. తమ ప్రభుత్వం చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేసిందని పార్టీ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించేవారని అంటున్నారు. బోరుగడ్డ వంటి వారి వల్లే ప్రజల్లో వైసీపీపై దురాభిప్రాయం ఏర్పడిందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డ ఏడు నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చారు. తన మకం గుంటూరు నుంచి హైదరాబాద్ కు తాత్కాలికంగా మార్చారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత బోరుగడ్డ చాలాకాలం సైలెంటుగానే ఉన్నాడు. అయితే కొన్ని యూట్యూబ్ చానళ్లు మళ్లీ అతడిని ఇంటర్వ్యూలు చేయడంతో తాను మాజీ సీఎం జగన్ శిష్యుడినంటూ చెప్పుకోవడం ప్రారంభించాడు. అంతేకాకుండా తనకు పార్టీకి సంబంధం లేదంటూ చెబుతున్న నేతలపై తీవ్ర పదజాలంతో దూషణలు మొదలుపెట్టాడు. తనకు జగన్ అండగా నిలిచారని, ఆయనే బెయిలు ఇప్పించారని కూడా బోరుగడ్డ ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. తాను ఇన్నాళ్లు రిపబ్లికన్ పార్టీలో కొనసాగానని, ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలో జగన్ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతానని కూడా చెప్పాడు. దీంతో వైసీపీ ఉలిక్కిపడింది.
బోరుగడ్డ మాటలను గతంలో మాదిరిగా ఉపేక్షిస్తే పార్టీకి చెడ్డపేరు ఖాయమన్న భావనతో వెనువెంటనే స్పందించింది. బోరుగడ్డ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో దర్శనమిచ్చిన గంటల వ్యవధిలోనే అతడితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పార్టీ నేతలపై అతడు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. అయితే బోరుగడ్డకు పార్టీతో సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కాదని, అతడు పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న యూట్యూబర్లు సూచిస్తున్నారు. దీంతో బోరుగడ్డ ఎపిసోడ్ తమషాగా మారిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.