లోకల్ పోటీలో వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా..?
స్థానిక సమరానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే అక్టోబరు నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉంది.;
స్థానిక సమరానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే అక్టోబరు నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఏం చేయనుంది? అనేది ఆస క్తిగా మారింది. ఎందుకంటే.. దెబ్బపై దెబ్బ తగులుతున్న నేపథ్యంలో అసలు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే బెటర్ అన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచనగా ఉంది. కానీ, స్థానికంగా పోటీ చేసి తీరాలని సీనియర్లు చెబుతున్నా రు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఆస్తిగా మారింది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలావుంటే.. స్థానికంగా పార్టీ బలంగా ఉందని.. సీనియర్లు చెబుతున్నారు.కానీ, సగానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు ఎవరూ రెడీలేరన్నది కూడా వాస్తవమే. అయినప్పటికీ.. స్థానికంగా సత్తా చాటక పోతే.. బ్యాడ్ సంకేతాలు వస్తాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వ బలప్రయోగం ముందు తాము తేలిపోతామని.. అప్పుడు పోటీ చేసి కూడా ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీ చేయాలని కొంత సేపు.. వద్దని కొంత సేపు చర్చల్లో చెబుతున్నారు.
మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? అనేది కూడా కీలక అంశం. చాలా మంది యువ నాయకులు పోటీకి సిద్ధమనే అంటున్నారు. స్థానికంగా తమ సత్తా చాటేందుకు ఇది చక్కని అవకాశంగా వారు చెబుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నామని కూడా అంటున్నారు. అలా కాదని.. ఎన్నికల పోరు నుంచి తప్పించుకుంటే.. అది పరువు పోయే ప్రయత్నమే అవుతుందన్నది మెజారిటీ నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పార్టీలో ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందనేది చూడాలి.
మరోవైపు.. ప్రజల కోణంలోనూ.. ఈ విషయం చర్చకు వస్తోంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా.. పోటీ అనేది ఉండాలన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రం ఖచ్చిత పోరు ఉండాలన్నది చెబుతున్నారు. పోటీలోనే లేకపోతే.. పార్టీ ఉనికిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధినేత తప్పుకొంటున్నట్టు ప్రకటించినా.. నాయకులు మాత్రం స్వతంత్రంగా పోటీ చేయడం తెలిసిందే. అలానే ఇప్పుడు వైసీపీ తప్పుకొంటే.. తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామని మెజారిటీ నాయకులు చెబుతుండడం గమనార్హం.