నవంబరు 14.. జగన్ డైరీలో ఈ డేట్ రాసిపెట్టుకోవాల్సిందేనా?
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ కోర్టు నుంచి చిక్కులు తప్పేలా లేవంటున్నారు.;
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ కోర్టు నుంచి చిక్కులు తప్పేలా లేవంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత ఏడేళ్లుగా కేసు విచారణకు సంబంధించి కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందతున్నారు. ఆయన తరఫున న్యాయవాదులే ఇన్నాళ్లు కోర్టుకు వస్తున్నారు. అయితే ఇటీవల లండన్ పర్యటన నిమిత్తం సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన మాజీ సీఎం జగన్ కు కొన్ని షరతులపై అనుమతి లభించింది. ఇందులో అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం జగన్.. కోర్టు షరతులను ఉల్లంఘించారని, పనిచేయని ఫోన్ నెంబరు ఇచ్చారని దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. అయితే లండన్ వెళ్లిన జగన్ తిరిగి వచ్చేయడంతో సీబీఐ పిటిషన్ పై విచారణ అవసరం లేదని కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో జగన్ హాజరు విషయమై మరోమారు ప్రస్తావించింది.
దీంతో నవంబరు 14న జరిగే విచారణకు మాజీ సీఎం జగన్ హాజరు అవ్వాల్సివుంటుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2012లో జగన్ పై తొలిసారి అక్రమాస్తుల కేసు నమోదైంది. మొత్తం 11 అంశాల్లో ఆయనపై 11 కేసులు నమోదుచేయగా, అన్నింటిలో ఏ1గా జగన్ పేరును చేర్చారు. ఈ కేసుల్లో 2012 మే 27వ తేదీన ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత 16 నెలలు జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. బెయిల్ పై విడుదల తరువాత సీబీఐ కోర్టులో చార్జిషీట్లు దాఖలుచేసింది. వీటిపై సీబీఐ కోర్టులో ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది.
2019లో సీఎం అవ్వకముందు జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే విచారణకు హాజరయ్యేవారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హాజరు నుంచి మినహాయింపు కోరితే, కోర్టు తిరస్కరించింది. దీంతో పాదయాత్రకు ప్రతి శుక్రవారం విరామం ప్రకటించి, హైదరాబాద్ కోర్టుకు వచ్చేవారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా కోర్టు మెట్లక్కలేదు. అధికారిక విధి నిర్వహణలో బిజీగా ఉండటం, సెక్యూరిటీ సమస్యలను చూపి కేసు విచారణ సమయంలో మినహాయింపు పొందారు జగన్. అయితే గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత మళ్లీ కోర్టు హాజరు కావాల్సిందేనని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే జగన్ తరఫు న్యాయవాదుల వాదనల వల్ల ఇప్పటివరకు మినహాయింపు పొందుతూ వచ్చారు.
ఇప్పటివరకు సుమారు ఏడేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందుతున్న జగన్.. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో తప్పనిసరిగా వెళ్లాల్సి వుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెబుతున్న జగన్ తరఫు న్యాయవాదులు తమకు ఇంకో అవకాశం ఉందని చెబుతున్నారు. కోర్టు నుంచి మినహాయింపు పొందేలా న్యాయపోరాటం కొనసాగుతుందని సంకేతాలిస్తున్నారు. దీంతో వచ్చేనెల 14న జగన్ సీబీఐ కోర్టుకు వెళ్తారా? లేదా? అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.