బహిష్కరణ పర్వంలో వైసీపీదే రికార్డు !
చట్ట సభలే ప్రజాస్వామ్య వేదికలు. అక్కడ అన్ని పక్షాలు కలిసి ప్రజా సమస్యల మీద చర్చిస్తాయి.
చట్ట సభలే ప్రజాస్వామ్య వేదికలు. అక్కడ అన్ని పక్షాలు కలిసి ప్రజా సమస్యల మీద చర్చిస్తాయి. అలాంటి వేదికలను బహిష్కరించడం అన్నది తొలి తరంలో జరిగేది కాదు, అసలు వాకౌట్లు కూడా అప్పట్లో తక్కువగా ఉండేవి. అయితే రాను రానూ రాజకీయం పెరిగి సభలకే డుమ్మా కొడుతున్నారు. ఇక దేశంలో శాసనసభ మొత్తాన్ని లేదా సమావేశాలను ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ పూర్తిగా బహిష్కరించడం అనేది ఎక్కడా లేదని అంటున్నారు. అదే సమయంలో ఇది రాష్ట్రాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులు అధికార ప్రతిపక్షాల మధ్య వివాదాలు లేదా సభలో తమకు సముచిత గౌరవం దక్కలేదనే కారణాలపై ఈ బహిష్కరణలు ఆధారపడి ఉంటాయి.
పాక్షిక బహిష్కరణలు :
మరో వైపు చూస్తే భారతదేశంలో అసెంబ్లీలను బహిష్కరించే పార్టీలు ఉన్నా పాక్షికంగా పరిమితంగా జరిగిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. కొన్ని సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలు నిరసనగా సభలకు దూరంగా ఉంటూ వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతారాహిత్యంగా అధికార పార్టీలు విమర్శిస్తుంటాయి. సభలో చర్చల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, బహిష్కరణలు సరైనవి కాదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుంటారు. ఏపీలో చూస్తే మూడు సందర్భాలలో ముగ్గురు నాయకులు అసెంబ్లీ బహిష్కరణ పిలుపు ఇచ్చారు. వారే ఎన్టీఆర్, జగన్ చంద్రబాబుగా చెప్పాలి
ఎన్టీఆర్ ప్రతినతో :
మూడున్నర దశాబ్దాల క్రితం చూస్తే ఎన్టీఆర్ 1989లో విపక్షంలో ఉన్నారు. అయితే ఆయన పార్టీకి చెందిన వారు అంతా సభకు హాజరయ్యారు. అప్పట్లో ఉప నాయకులుగా చంద్రబాబు ఇతర నేతలు కలసి టీడీపీని అసెంబ్లీలో నడిపించారు. ఇక జగన్ అయితే 2017లో అసెంబ్లీకి రావడం లేదని ఒక దండం పెట్టి మరీ జనంలోకి పాదయాత్ర కోసం వెళ్ళారు. అయితే జగన్ అప్పటికి మూడేళ్ళ పాటు అసెంబ్లీకి హాజరయ్యేవారు. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సభలో తనకు అవమానం జరిగిందంటూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి మళ్లీ అధికారంలోకి వస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి వెలువడిన సందర్భాన్ని రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తుంటారు.
అక్కడ జయలలిత కూడా :
ఇక అసెంబ్లీలను బహిష్కరించడం అన్న దానికి బీజం తమిళనాడులో జయలలిత హయాంలో పడింది అని చెప్పాల్సి ఉంటుంది. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘోర అవమానం కారణంగా ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత సభను బహిష్కరించారు. డీఎంకే సభ్యుల దాడిలో అవమానానికి గురైన ఆమెమళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగుపెడతాను అని భీష్మ ప్రతిజ్ఞ చేసి సభను వీడారు. ఈ సంఘటన ఆమె రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ప్రజల్లో ఆమెకు సానుభూతి పెరిగింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత 1991 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, తాను అనుకున్నట్టుగానే తమిళనాడు తొలి మహిళా పూర్తికాల ముఖ్యమంత్రిగా ఘనంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
వైసీపీ తీరు వేరుగా :
అయితే వైసీపీ మాత్రం 2024లో కొత్త అసెంబ్లీ ఏర్పాటు అయ్యాక అసెంబ్లీకి వెళ్ళడం మానుకుంది. ఆ పార్టీ తనకు 11 సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోరుతోంది. అయితే రూల్స్ మాత్రం అందుకు ఒప్పుకోవని స్పీకర్ ఆఫీసు చెబుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీకి వైసీపీ దూరంగా ఉంటోంది. ఇప్పటికి 26 నెలలు గడచిపోయినా వైసీపీ అసెంబ్లీ వైపు చూడడం లేదు, దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విమర్శలు చేశారు.
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని ప్రతిపక్షాలు బహిష్కరించడం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలపై సభలోనే తేల్చుకోవాలని ఆయన అన్నారు. వైసీపీ తీరును తప్పుపడుతూ తన రాజకీయ జీవితం మొత్తంలో ఇలాంటివి చూడలేదని అన్నారు. దేశంలో కూడా ఈ రకమైన పరిణామాలు ఎక్కడైనా జరిగాయో లేవో కానీ ఈ విషయంలో వైసీపీది కొత్త రికార్డు అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.