పార్కింగ్ బాదుడు...నెమ్మదిగా అలవాటవుతుందన్న ఎంపీ

ఎయిర్ పోర్టుకు పికప్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే ఎనిమిది నిముషాలకే పార్కింగ్ ఫ్రీ ఉంటుందని ఆయన చెప్పారు.

Update: 2026-08-19 19:30 GMT

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద ఎయిర్ పోర్టు, పైగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అద్భుతమైన నిర్మాణం అని జనమంతా అచ్చెరువందేలా నిర్మించారు. దేశాన్ని ఏలే ప్రధాని చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు స్టార్ట్ అయింది. అంతా బాగుంది ఇంకేమిటి అనుకున్నారు. అయితే పార్కింగ్ దగ్గరే పెద్ద దెబ్బ పడిపోతోంది. గంటకు వందల్లో రేటు పెంచుతూ పార్కింగ్ మీటర్ యమ స్పీడ్ గా తిరగడంతో వాహనదారులు అంతా బెంబేలెత్తిపోతున్నారు. వీరిలో టాక్సీ డ్రైవర్లు కూడా ఉన్నారు. విశాఖ నుంచి ఏడు వందలకు బేరం కుదుర్చుకుని భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద ఆపితే పార్కింగ్ ఫీజు ఆరు వందలు వేశారు అని ఒక టాక్సీ డ్రైవర్ ఏకంగా సదరు ఎయిర్ పోర్టు సిబ్బందితో వాదులాట పెట్టుకున్నది వీడియో అయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అలవాటు చేసుకోవాలి :

దీని మీద విశాఖ ఎంపీ శ్రీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ స్వాంతన వచనాలే వల్లించారు. ఆయన చెప్పిన ఈ మాటలు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించి సుదీర్ఘ కాలానికి లీజుగా తీసుకున్న జీఎమ్మార్ కి అనుకూలంగా ఉండడం విశేషం. ఆయన ఇంతకీ ఏమన్నారు అంటే జీఎమ్మార్ చిన్న సంస్థ కాదు, ఢిల్లీ హైదరాబాద్ లలో ఎయిర్ పోర్టులని నిర్మించింది. అంతే కాదు ఎంతో అనుభవం ఉన్నది అన్నారు. ఇక ఈ పార్కింగ్ ఫీజులు అక్కడ ఉన్న పాలసీలే ఇక్కడ కూడా పెడుతున్నారు అని తాపీగా సెలవిచ్చారు. మనది అది అలవాటు లేకపోవడం వల్లనే ఇబ్బంది అవుతోంది అన్నారు. పార్కింగ్ బాదుడు అన్నది తాను సోషల్ మీడియాలో చూశాను అంటూనే జనాలే అలవాటు పడాలని చెప్పడం ఎంపీగారికే చెల్లింది అంటున్నారు.

ఎనిమిది నిమిషాలు ఫ్రీ :

ఎయిర్ పోర్టుకు పికప్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే ఎనిమిది నిముషాలకే పార్కింగ్ ఫ్రీ ఉంటుందని ఆయన చెప్పారు. అక్కడ కారు ఆగిపోయి ఉంటే ఎనిమిది నుంచి పది నిముషాలకే పార్కింగ్ చార్జి చేస్తారు అని అన్నారు. ఒకటి పార్కింగ్ వల్ల తమకు ఆదాయం రావడం కారణం కావచ్చు అని రెండవది ఎక్కువ సేపు కార్లు పార్కింగ్ చేస్తే కొత్త కార్లకు అక్కడ చోటు ఉండదని కూడా కారణం కావచ్చు అని శ్రీ భరత్ విడమరచి మరీ చెప్పారు. ఎనిమిది నిముషాల్ చాలా సరిపోయే టైం అని ఆయన అంటున్నారు.

అక్కడంతా బాగుందిగా :

హైదరాబాద్ లో ఏడాదికి నాలుగు కోట్ల మంది ప్రయాణిస్తున్నారని అక్కడ రోజుకు వేల టాక్సీలు వస్తాయని పార్కింగ్ ఫీజు చెల్లిస్తున్నారు కదా అక్కడ అంతా బాగానే ఉంది కదా అని ఎంపీ చెప్పుకొచ్చారు. ఇదంతా తాత్కాలిక ఇబ్బందిగానే చూడాలని అన్నారు. పైగా కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. మొత్తానికి ఎంపీ గారు సెలవిచ్చినది ఏంటి అంటే పార్కింగ్ బాదుడు మొదట్లో భారంగా ఉన్నా నెమ్మదిగా అలవాటు అయిపోతుంది అని అన్న మాట.

ఢిల్లీ, హైదరాబాద్ తో పోలిక :

ఎంపీ శ్రీ భరత్ చెప్పినది బాగానే ఉన్నా ఢిల్లీ హైదరాబాద్ తో ఉత్తరాంధ్ర కు పోలిక ఏ మేరకు సబబు అని అంటున్నారు. పైగా నిన్నటిదాకా ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో నడచిన విశాఖ ఎయిర్ పోర్టులో పార్కింగ్ ఫీజు ఇంత భారీగా లేదు. అందుకే టాక్సీ డ్రైవర్లు కానీ వాహనదారులు కానీ దానితో సరిపోల్చుకుంటున్నారు. ఒక్కసారిగా డబుల్ త్రిబుల్ పార్కింగ్ చార్జీలు పెంచడాన్ని ప్రజా ప్రతినిధులు అయినా ఆలోచించాలి కదా అని జనాలు అంటున్నారు. పైగా ఉత్తరాంధ్రాకు పెద్ద ఎయిర్ పోర్టు వచ్చింది కానీ ఒక్కసారిగా వెనకబడిన ప్రాంతం ఏమీ మారలేదు కదా అన్నది కూడా నెటిజన్ల మాటగా ఉంది. మరి దీనికి ఎంపీగారు ఏ విధంగా జవాబు చెబుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News