భారత్ లో అంతర్భాగమే.. కశ్మీర్ గడ్డ మీద నుంచి అమెరికా సంచలన ప్రకటన..పాకిస్తాన్ కు షాక్

సెర్గియో గోర్‌తో భేటీపై ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. కాశ్మీర్ సమస్యకు అమెరికా పరిష్కారం చూపలేదని.. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

Update: 2026-08-19 17:30 GMT

జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో ఒక ముఖ్యమైన భాగమని ఆయన స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బుధవారం శ్రీనగర్‌లో పర్యటించిన సెర్గియో గోర్.. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాశ్మీర్‌లో పరిస్థితులు, అభివృద్ధి, ఆర్థిక సహకారం, భారత్-అమెరికా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశం అనంతరం గోర్ తన పర్యటనపై సానుకూలంగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్‌కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్‌పై విమర్శలు చేసే పాకిస్థాన్‌కు ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. దీంతో సెర్గియో గోర్ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా దాదాపు 15 ఏళ్ల తర్వాత అమెరికా రాయబారి ఒకరు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రితో ప్రత్యక్షంగా సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. 2011లో అప్పటి అమెరికా రాయబారి తిమోతీ రోమర్.. అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఆ తర్వాత ఇంత ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.

సెర్గియో గోర్‌తో భేటీపై ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. కాశ్మీర్ సమస్యకు అమెరికా పరిష్కారం చూపలేదని.. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో అమెరికా రాయబారి పర్యటనకు రాజకీయ రంగు రాకుండా ఒమర్ అబ్దుల్లా తన వైఖరిని స్పష్టం చేసినట్టయింది.

మరోవైపు, అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు ఇటీవల మళ్లీ బలపడుతున్న సమయంలో గోర్ వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మధ్య ఇటీవల సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కాశ్మీర్‌పై అమెరికా రాయబారి చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలను కాశ్మీర్ అంశంపై అమెరికా అధికారిక విధానంలో పూర్తి మార్పుగా భావించాలా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అయినప్పటికీ భారత్‌లోని అమెరికా రాయబారి జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లోని ముఖ్యమైన భాగంగా పేర్కొనడం మాత్రం ప్రస్తుతం దౌత్య, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయీకరించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు భారత్‌కు అనుకూలంగా నిలిచే కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News