వైసీపీ నుంచి ఎగ్జిట్ అయితే నో ఎంట్రీ...ఇక అంతే !

వైసీపీ దేశంలో ఒక విలక్షణమైన పార్టీ. నిజానికి తమది తేడా గల పార్టీ అని బీజేపీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది కానీ ఆ పార్టీ మిగిలిన పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్కే అని అనేక సందర్భాలలో రుజువు చేసుకుంది.

Update: 2026-08-20 03:39 GMT

వైసీపీ దేశంలో ఒక విలక్షణమైన పార్టీ. నిజానికి తమది తేడా గల పార్టీ అని బీజేపీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది కానీ ఆ పార్టీ మిగిలిన పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్కే అని అనేక సందర్భాలలో రుజువు చేసుకుంది. అలాగే అన్ని పార్టీలూనూ. రాజకీయాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉంటాయి. రాజకీయం అనే ఆట ఆడాలి అంటే ఇవి తప్పనిసరి. అయితే అదే రాజకీయాల్లో కొనసాగుతూ వైసీపీ లాంటి పార్టీలు మాత్రం తమదైన నిబంధలనతో ఆట ఆడుతూంటాయి. ఈ పార్టీలు ఎపుడూ రిస్క్ చేస్తూనే ఉంటాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చినా రూట్ మారదు, ఆట తీరు అంతకంటే మారదు.

వైసీపీ ఎలా భిన్నం అంటే :

దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ ఏదో ఒక దశలో పొత్తులు పెట్టుకున్నాయి. పొత్తులు పెట్టుకోకుండా గడచిన పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న ఏకైక పార్టీ వైసీపీ ఒక్కటే. అంతే కాదు మరో పార్టీతో కలిసి కనీసం ఉద్యమాలు కూడా చేయకుండా మడి కట్టుకున్న పార్టీ సైతం అదే. అధికార కార్యక్రమాలలో అయినా అన్ని పక్షాలు కలుస్తాయేమో కానీ వైసీపీ వీటికి కూడా దూరంగా ఉంటుంది. అంతే కాదు రాజకీయాల్లో అత్యంత కీలకమైన మౌలికమైన ముఖ్య సూత్రం ఒకటి ఉంది. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వతం కాదని. దీనిని వైసీపీ పూర్తి విరుద్ధంగా తనదైన సూత్రం రాసుకుంది. అదే వైసీపీకి శత్రువులు శాశ్వతం. మిత్రుల సంగతి ఆ పార్టీ పరంగా ఎవరు అన్నది పక్కన పెడితే శత్రువుల జాబితా ఎక్కువగా ఉంటుంది. వారి విషయంలో అసలు క్షమించేది ఉండదని అంటారు.

పార్టీని వీడితే అంతే :

వైసీపీలో మరో లక్షణం ఉంది అంటారు. ఇతర పార్టీలకు ఇది విభిన్నమే అని చెబుతారు. వైసీపీని అభిమానించి ఆరాధించిన వారు పార్టీలో కొనసాగితే ఓకే. ఎవరైనా విభేదించి బయటకు వెళ్తే మాత్రం ఇక ఎప్పటికీ వైసీపీ తలుపులు తెరచుకోవు అనే అంటారు. ఇతర పార్టీలలో అలా ఉండదు, పార్టీని వీడినా తిరిగి వస్తే చేర్చుకుంటారు. ఎందుకంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ లో అవసరాలు సమీకరణలు అన్నీ ఉంటాయి. అయితే వైసీపీ అవన్నీ చూసుకోదని అంటారు. దాంతో వైసీపీలో ఒకసారి ఎగ్జిట్ అయితే నో ఎంట్రీ అన్నది బలంగా ఉంటుంది అంటారు.

వారికి చోటు లేదు :

ఇదిలా ఉంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. వారు ఆ తరువాత మళ్ళీ వైసీపీలో తిరిగి చేరే ప్రయత్నం చేశారో లేదో కానీ వచ్చినా చేర్చుకోరు అన్నది పార్టీ దృఢమైన ఫిలాసఫీగా ఉంటోంది. ఇక విజయసాయిరెడ్డి వైసీపీని వీడుతారు అని ఎవరూ అనుకోలేరు. కానీ ఆయన వీడారు. అయితే ఆయన మళ్ళీ ఏ రోజు అయినా చేరుతారు అని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిని బట్టి విజయసాయిరెడ్డి లాంటి వారికి కూడా నో ఎంట్రీ అక్కడ అని తేలిపోయింది అంటున్నారు. మరి 2024 నుంచి చూస్తే అనేక మంది పార్టీని వీడారు. వారిలో కూటమిలో చేరిన వారు ఉంటే ఏ పార్టీలో చేరని వారు కూడా ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి వైసీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగుతూ వస్తోంది. కానీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చూశాక మాత్రం అందరికీ ఒక డౌట్ వస్తోంది. ఆయనకే ఎంట్రీ లేకపోతే వీరి సంగతి ఏమిటి అని. సో వీరికి కూడా నో ఎంట్రీ అని వేరేగా చెప్పాల్సిది లేదు అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో ఎవరైనా ఉంటే ఎన్నాళ్ళు అయినా కొనసాగవచ్చు. మిగిలిన పార్టీల మాదిరిగా ఒత్తిళ్ళు అయితే ఉండవు, వారి పనితీరు మీద పెద్దగా పట్టింపు కూడా ఉండదని అంటారు. కానీ ఏ కారణం చేత అయినా ఒక్కసారి బయటకు వెళ్తే వారి ఆప్షన్స్ నుంచి వైసీపీని శాశ్వతంగా తీసేయాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News