వైసీపీ కార్యకర్తలకు జగన్ బిగ్ టాస్క్.. వచ్చే 45 రోజులు చాలా కీలకం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.;
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. గురువారం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని పరిశీలించిన అనంతరం వైసీపీ పోరాటంపై స్పష్టమైన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత 75 ఏళ్లలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలను పెడితే, తన హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని జగన్ చెబుతున్నారు. ఇందులో 5 కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారని, మిగిలిన 12 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు.
తమ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పిపిపి విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తామంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసిన జగన్.. తన పంతం నెగ్గించుకునేందుకు ప్రజా మద్దతు కూడగట్టేలా పోరాటం డిజైన్ చేశారు. శుక్రవారం (అక్టోబరు 10) నుంచి వచ్చేనెల 25 వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సుదీర్ఘ ప్రజా పోరాటానికి షెడ్యూల్ ప్రకటించారు. గురువారం నర్సీపట్నంలో జగన్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త సజ్జల రామక్రిష్ణారెడ్డి మరికొందరు నేతల సమక్షంలో ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇందులో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాల్లో సంతకాలు సేకరించనున్నారు. ఈ రోజు నుంచి వచ్చేనెల 22 వరకు ఈ సంతకాల సేకరణ ఉంటుంది. ఇక ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు. అదేవిధంగా వచ్చేనెల 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇక నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాలు సేకరించిన పత్రాలను ప్రజల సమక్షంలో తరలిస్తారు. నవంబరు 24న వాటిని జిల్లా కేంద్రాల నుంచి లారీలపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువస్తారు.
ఇక చివరగా నవంబర్ 25న పార్టీ కార్యాలయానికి వచ్చిన కోటి సంతకాల పేపర్లను గవర్నర్ కు సమర్పిస్తారు. దీని ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పాలని భావిస్తున్నారు. అదేసమయంలో తన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నారు.