అసెంబ్లీకి వైసీపీ...జగన్ కొత్త ప్లాన్ చేస్తున్నారా ?

వైసీపీ పరిస్థితి అయితే పూర్తిగా ఇరకాటంలో పడింది అనే అంటున్నారు. కేవలం టెక్నికల్ రీజన్స్ ని పట్టుకుని అసెంబ్లీకి గైర్ హాజరు అయ్యారు.;

Update: 2025-09-16 16:30 GMT

వైసీపీ పరిస్థితి అయితే పూర్తిగా ఇరకాటంలో పడింది అనే అంటున్నారు. కేవలం టెక్నికల్ రీజన్స్ ని పట్టుకుని అసెంబ్లీకి గైర్ హాజరు అయ్యారు. ఏకంగా 15 నెలల కాలాన్ని ఇలాగే గడిపేశారు. మొత్తం అరవై నెలల ఎమ్మెల్యేల పదవీ కాలంలో పావు వంతు ఈ విధంగా పోయింది అన్న మాట. ప్రతిపక్ష పాత్రని నిర్వహించాలని ప్రజలు తమకు బాధ్యత అప్ప్గిస్తే వైసీపీ మాత్రం తాము అసెంబ్లీకి రావాలీ అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని కండిషన్ పెడుతోంది అన్న భావన అయితే ప్రజలలోకి వెళ్లిపోయింది అంటున్నారు.

అది జరిగే పని కాదని :

వైసీపీకి అధికార కూటమికి మధ్య రాజకీయాల కంటే కూడా ఎక్కువ వైరం ఉంది అన్నది తెలిసిందే. మామూలుగా అయితే హుందాగా రాజకీయాలు సాగితే అధికార పక్షానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవేమో. విపక్ష హోదా ఇచ్చినా తప్పేమీ లేదని భావించవచ్చు. కానీ జగన్ తాను సీఎం గా ఉండగా చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు కానీ అటు నుంచి ఇటు నలుగురిని లాగేస్తే మీ విపక్ష హోదా పోతుంది అని మాట్లాడిన దానిని కానీ చూసుకున్నా అయిదేళ్ళ వైసీపీ అధికారంలో టీడీపీని పెట్టిన ఇబ్బందులు విమర్శలు చూసినా కూటమి అసలు ఈ ప్రతిపాదనకు అంగీకరించేది ఉండదు. మరి అది తెలిసి పట్టుబట్టడం వల్ల అయిదేళ్ళూ సభకు దూరంగా ఉండడం తప్ప వేరే ప్రయోజనం అయితే సాధించింది లేదని అంటున్నారు.

జనంలో వ్యతిరేకత :

ఇక కూటమి పెద్దలు అయితే తెలివిగానే పదే పదే ఈ ఇష్యూని జనంలో పెడుతున్నారు. పైగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. ప్రజల సమస్యల కోసం అసెంబ్లీకి రానపుడు ఎమ్మెల్యే పదవులు ఎందుకు అన్న మాట కూడా వారు అంటున్నారు. అంతే కాదు ప్రతీ అసెంబ్లీ సమావేశాల ముందు వైసీపీని పిలుస్తున్నారు. అయితే వైసీపీ వస్తుందని తమ మాట వింటుందని కాదు జనాలకు ఈ విషయం బాగా చెప్పాలని వారికి వైసీపీ చేస్తున్న తప్పు ఎత్తి చూపాలని ఇపుడు సరిగ్గా అదే జరుగుతోంది వైసీపీ మీద జనంలో అయితే వ్యతిరేకత వస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడం మీద జనాలు కూడా గుస్సా అవుతున్నారు.

తాను తప్ప అందరూ :

ఈ నేపధ్యంలో వీటిని మొత్తం పరిశీలించిన మీదట వైసీపీ అధినాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. తాను తప్ప మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఈసారి పంపించాలని జగన్ భావిస్తున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి బాధ్యతలు అప్పగించి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తే కనుక ప్రజల వ్యతిరేకత తప్పుతుంది. కూటమి నుంచి కూడా విమర్శలు పెద్దగా ఉండవని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతే కాదు తాను గైర్ హాజర్ కావడం ద్వారా తన పంతం నెరవేర్చుకున్నట్లుగా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ రకమైన ప్రచారంలో ఎంత నిజం ఉంది అన్నది ఈ నెల 18 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలోనే తెలియాలి అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలని పంపిస్తే మాత్రం అది కూడా రాజకీయ చర్చకు దారి తీసే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News