ఇంటి నాలుగోడలే చూడమంటున్న జగన్...?
అంటే ఆంధ్రా ఓటరుని కేవలం ఇంటి నాలుగు గోడల మధ్యనే చూసి ఏపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది చెప్పాలని అంటున్నారు.;
అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికల్లో ఓటరు ఓటు వేస్తాడు. అది లోక్ సభకు అయితే దేశవ్యాప్తంగా పరిస్థితుల మీద అవగాహనతో ఓటు వేయాలి. అసెంబ్లీకి అయితే రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా బేరీజు వేసుకుంటూ దానికి అనుగుణంగా ఆలోచనలు చేస్తూ తీర్పు ఇవ్వాలి. ఏడున్నర దశాబ్దాల భారత దేశ చరిత్రలో ఓటరు ఎపుడూ తన తీర్పుని తప్పుగా ఇవ్వలేదు.
రాజకీయ పార్టీలే ఆ తీర్పుకు వక్ర భాష్యాలు చెబుతూ తప్పు దోవ పట్టించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓటు వేసేటపుడు ఓటరు అన్నీ ఆలోచిస్తారు అని అంటారు. అధికారంలో ఉన్న పార్టీ అయితే తాను చేసిన మంచిని మాత్రమే చూడమంటుంది. విపక్షాలు మొత్తం అన్నీ ఉన్నవీ లేనివీ చూడమని అంటాయి.
ఏపీలో రాజకీయ సమరం భీకరంగా సాగేలా కనిపిస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్యహ అది హోరా హోరీ అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రతీ అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి అసలు ఇష్టపడరు. ఈ క్రమంలో వైసీపీ ఏపీ జనాలకు ఏమీ చేయలేదని విపక్షం చాన్నాళ్ళుగా చెబుతూ వస్తోంది. జగన్ సైతం దాన్ని ధీటుగానే తిప్పుకొడుతున్నారు.
ఆయన ప్రతీ సభలోనూ తాను ఏపీ ప్రజలకు మంచి చేస్తే దాన్ని చూసి మాత్రమే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు వేయి చెబుతాయి, వాటి మాటలు అసలు పట్టించుకోవద్దు. మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా చూసుకుని మరీ ఓటేయాలని కోరుతున్నారు. అంటే ఆంధ్రా ఓటరుని కేవలం ఇంటి నాలుగు గోడల మధ్యనే చూసి ఏపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది చెప్పాలని అంటున్నారు.
నిజంగా ఇక్కడే వైసీపీ ఎత్తుగడ ఉందని అంటున్నారు. ఎవరికి వారు తమ ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉంటూ అక్కడే ఆలోచించి ఓటెస్తే మాత్రం అది కచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీ ఇంటికి వివిధ పధకాల కింద కనీసంగా లక్షకు తక్కువ కాకుండా మూడు నుంచి అయిదు లక్షల దాకా జగన్ ఈ అయిదేళ్లలో ఇచ్చారు.
ఒక ప్రభుత్వం నుంచి సామాజిక బాధ్యతగా అందరితో పాటు అభివృద్ధి ఫలితాలు అందడం వేరు. కానీ వ్యక్తిగత లబ్దిగా లక్షలు కురియడం వేరు. అలా ఇంతకు ముందు ఎపుడూ ఎక్కడా స్వాతంత్ర భారత దేశంలో జరగలేదు. నగదు బదిలీ పధకం కింద ఎంతో కొంత సాయం చేసినా ఇలా లక్షలను తెచ్చి ఒక సాదా కుటుంబం ఖాతాలో వేసిన దాఖలా అయితే లేదు.
అంటే ఇక్కడ జగన్ చెప్పేది కూడా అదే అంటున్నారు. కళ్ల ముందు పధకాలు ఉన్నాయి. లబ్ది పొందినట్లుగా బ్యాంక్ ఖాతాలు కచ్చితంగా లెక్క చెబుతాయి. అపుడు ఫ్యాన్ గుర్తుకే ఓటు పడుతుంది. అయితే ఇక్కడ మరో చర్చ కూడా ఉంది. దానిని మేధావులు తీసుకుని వస్తున్నారు. సామాజిక లబ్ధి గురించి ఓటరు ఆలోచించడా అని. సామాజిక లబ్ది అంటే ఊరికి రాష్ట్రానికి శాశ్వతమైన మేలు అని అర్ధం.
దానికి కూడా వైసీపీ వారి వద్ద లాజిక్కులు జవాబులు ఉన్నాయి. తాము పోలవరం కడతామని, కేంద్రం నుంచి నిధులు లేటుగా వస్తున్నాయని చెబుతారు. ప్రత్యేక హోదా లేకపోబట్టి పరిశ్రమలు అంత సులువుగా రావడంలేదని అంటారు. అమరావతి రాజధాని స్కాం కాబట్టి మూడు రాజధానులు తమ విధానమని, కోర్టు తీర్పు తరువాత అది ఆచరణకు వస్తుందని అంటారు. ఇక రోడ్లు, కాలువల నిర్మాణం ఇత్యాది వంటివి అన్నీ కూడా తాము ఎపుడూ చేస్తున్నవే అని అవన్నీ ప్రణాళికాబద్ధంగా చేస్తున్నవే అని అంటారు.
ఇలా వైసీపీ అభివృద్ధి మీద తన వాదన చెబితే అసలు ఏపీలో అభివృద్ధి లేదు అరాచకం తప్ప అని విపక్షాలు అంటాయి. ఇలా అదొక పెద్ద రచ్చ అవుతుంది. అందుకే ఈ గొడవ ఘోషా ఎందుకు అనుకుని వైసీపీ ఒక్కటే కోరుతోంది. అభివృద్ధి అంటూ వీధుల దాకా ఎందుకు రావడం, మీ ఇంట్లోనే చూసుకోండి. అదే కొలమానంగా తీసుకోండి అని. అలా కనుక చూస్తే లక్షల రూపాయల పధకాలు కళ్లెదుట ఉంటాయి కాబట్టి వైసీపీకి అది ఫుల్ అడ్వాంటేజ్ గానే చూడాలి.
మరి ఏపీ అభివృద్ధి అక్కరలేదా అని విపక్షాలు మేధావులు నిగ్గదీస్తే సగటు ఓటరు, అందున పధకాలు అందుకున్న ఓటరు ఎలా రియాక్ట్ అవుతాడు అన్న దానికి అసలైన రుజువుగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు. నిజం చెప్పాలంటే సామాజిక లబ్ది కోణం నుంచి ఓటరు దూరం జరిగి చాలా కాలం అయింది అనే అంటున్నారు. వారిని ఆ విధంగా తాయిలాలతో మభ్యపెట్టి మంచి చేసుకున్నది గడచిన పార్టీలే. ఇపుడు దాన్ని పీక్స్ కి వైసీపీ చేర్చింది అని అంటున్నారు.
ఎవరైనా ముందు తన కడుపు నిండాలని అనుకుంటారు, తన ఇల్లు బాగుండాలి అని అనుకుంటారు. ఆ విధంగా సంకుచితంగా ఆలోచించేలా వారి మైండ్ సెట్ ని పార్టీలే చేశాయి కాబట్టి ఇపుడు వైసీపీని కొత్తగా అనుకోవాల్సిన పనిలేదు. అందువల్ల లబ్ది పొందిన ఓటరు ఇంటి నాలుగు గోడల మధ్యనే అభివృద్ధిని చూసి ఓటేస్తాడు, మరోసారి అధికారం ఇస్తారన్నది వైసీపీ ధీమా. మరి ఏమి జరుగుతుందో 2024 ఎన్నికల్లో చూడాల్సిందే.