ఆ ఎమ్మెల్సీకి జగన్‌ బంఫర్‌ ఆఫర్‌!

వైసీపీకి కంచుకోట జిల్లాల్లో ఒకటి.. నెల్లూరు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది

Update: 2024-01-28 03:41 GMT

వైసీపీకి కంచుకోట జిల్లాల్లో ఒకటి.. నెల్లూరు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ దీన్ని పునరావృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గట్టి అభ్యర్థులపై దృష్టి సారించింది.

కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అనిల్‌ 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ తొలి విడత కేబినెట్‌ లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ తరఫున ప్రతిపక్షాలపై ఘాటుగా విరుచుకుపడే నేతల్లో ఒకరిగా అనిల్‌ పేరు తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ను ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించే యోచనలో జగన్‌ ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అనిల్‌ కు జగన్‌ తెలిపారని.. దీనిపై ఆలోచించుకుని మళ్లీ రావాలని కోరినట్టు టాక్‌ నడుస్తోంది.

అయితే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గతంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఈసారి నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. అనిల్‌ ను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read more!

ఈ నేపథ్యంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగొచ్చని అంటున్నారు. ఆయన స్థానంలో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం చంద్రశేఖరరెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. తూర్పు రాయలసీమ టీచర్స్‌ ఎమ్మెల్సీగా ఆయన గతంలో ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థిపై 1055 ఓట్లతో గెలుపొందారు.

కాగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1994లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో నెల్లూరు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీకి చైర్మన్‌ గా కూడా పనిచేశారు. కోవిడ్‌ సమయంలో వైసీపీ తరఫున రోగులకు సేవలందించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్థానంలో పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి సీటు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News