ఎవరు ఎవరి వారాసులు... అక్కలపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కడప రాజకీయం రోజు రోజుకీ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-05-08 09:21 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కడప రాజకీయం రోజు రోజుకీ తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ.. కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం.. ఈ సందర్భంగా ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్థావిస్తూ వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ పై తీవ్ర విమర్శలు గుప్పించడంతో.. కడప రాజకీయం గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా వైరల్ గా మారుతుంది.

అవును... ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయం అంత ఒకెత్తు, కడప రాజకీయం మరొకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి షర్మిళ, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో... వివేకా హత్య కేసును ప్రస్థావిస్తూ అవినాష్ పై షర్మిళ, సునీత తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. ఈ సమయంలో తాజాగా తన అక్కలపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... వివేకా హత్య కేసును తనపై అనవసరంగా మోపారని.. తనను, తన తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పిన అవినాష్ రెడ్డి... జైల్లో తన తండ్రిని కలిసినప్పుడల్లా.. తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని, అయినప్పటికీ దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని తనతో అంటూ ఆయన బాధపడేవాడరని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే... దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇటీవల తన తండ్రికి బెయిల్ వచ్చిందని తెలిపారు. అదేవిధంగా... ఏ తప్పు చేయనప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడని చెప్పిన అవినాష్... తాత్కాలికంగా కష్టాలు వచ్చినప్పటికీ వాటి వల్ల ఇబ్బంది కలగకుండా దేవుడు తోడుంటాడని, ఇది తాను నమ్మిన సిద్ధాంతమని తెలిపారు. ఈ సందర్భంగా తన అక్కలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more!

ఇందులో భాగంగా... తన ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌ లో పడిపోయారని ఆరోపించిన అవినాష్ రెడ్డి... షర్మిళ, సునీత ఇద్దరూ ఆయన డైరెక్షన్లో నడుచుకుంటున్నారని అన్నారు. అయితే... ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్‌ లో పడకుండా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని కోరారు.

దివంగత వైఎస్సార్‌ బ్రతికినంత కాలం.. ఆయన టీడీపీతో పోరాడారని.. అయితే తన అక్కలు మాత్రం వారితో చేతులు కలిపారని చెప్పిన అవినాష్... మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్‌ వారసులా? అని ప్రశ్నించారు. ఇక తనను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడని.. తన అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారని.. వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్‌ ఇచ్చిన టాస్క్‌ అని అవినాష్ అన్నారు.

ఈ సందర్భంగా ఏ తప్పు లేకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన అవినాష్... ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గట్టిగా నిలబడతాని.. ప్రజలందరి మద్దతుతో గెలిచి తీరుతాని.. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి, అది తాను వినాలని అన్నారు. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుందని.. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News