షర్మిలకు రాజ్యసభ యోగం ఉందా ?

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటున్నారు. ఆమె 2024 జనవరిలో ఈ పదవిని స్వీకరించారు. ఇప్పటికి రెండేళ్ళుగా కొనసాగుతున్నారు.;

Update: 2026-01-30 02:40 GMT

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటున్నారు. ఆమె 2024 జనవరిలో ఈ పదవిని స్వీకరించారు. ఇప్పటికి రెండేళ్ళుగా కొనసాగుతున్నారు. ఆమె రాక వల్ల ఆమె పగ్గాలు అందుకున్న తరువాత కాంగ్రెస్ పరిషితిలో ఏమైనా మార్పు ఉందా అంటే పెద్దగా లేదు అని చెప్పాలి. అయితే జాతీయ కాంగ్రెస్ నేతలకు ఆమె అతి పెద్ద ఊరటను కలిగించిన విషయం ఏమిటి అంటే కాంగ్రెస్ ని ఏపీలో దెబ్బ తీసి మొత్తం ఓటు బ్యాంక్ ని తన కొత్త పార్టీ వైసీపీలో కలిపేసుకున్న వైఎస్ జగన్ ని అధికారంలోకి దించడం. వైసీపీ ఓటమి కూడా ఈసారి ఘోరంగా ఉంది. దాంతో ఏమైనా ఆశలు ఉంటే వైసీపీ మరింత వీక్ కావడం మీదనే ఉన్నాయి.

కాంగ్రెస్ బలోపేతం కోసం :

అయితే కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా ఫలించలేదు, ఆమె వైసీపీని ఫోకస్ చేస్తూ తీసుకున్న రాజకీయ ఎత్తుగడలు కూడా పెద్దగా పారలేదు, కాంగ్రెస్ లో సీనియర్లు సైలెంట్ అయ్యారు, వైసీపీ నుంచి ఎవరూ కాంగ్రెస్ వైపు రాలేదు. ఈ విధంగా ఉన్న నేపధ్యంలో షర్మిలకు ఒక అవకాశం లభించింది. అదే మహాంతా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం పేరు మార్చి దాని రూల్స్ ని మార్చి కేంద్రంలో మోడీ సర్కార్ జీ రాం జీ అన్న కొత్త చట్టం చేయడం. దాన్ని ఆయుధంగా మార్చుకునే పనిలో షర్మిల ప్రస్తుతం ఉన్నారు.

జిల్లాలలో యాత్రలతో :

విశేషం ఏంటి అంటే జాతీయ ఉపాధి పధకాన్ని 2006 ఫిబ్రవరిలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ అనంతపురం జిల్లాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో ప్రారంభం చేయించారు. సరిగ్గా ఇరవై ఏళ్ళు ఆ పధకానికి నిండిన వేళ మోడీ ప్రభుత్వం మొత్తం మార్చేసింది. దాంతో రాహుల్ గాంధీని అనంతపురానికి తెచ్చి పెద్ద సభను పెట్టి తన తండ్రి వైఎస్సార్ వారసత్వాన్ని కాంగ్రెస్ పధకాన్ని కొనసాగించేలా షర్మిల రాజకీయ యుధానికి సిద్ధపడుతున్నారు. ఆమె ఆ మీదట వరసగా జిల్లాల పర్యటనకు కూడా శ్రీకారం చుడుతున్నారు.

మొత్తం ఏపీ అంతటా :

వలస కార్మికుల సమస్యగా జాతీయ ఉపాధి హామీ పధకం ఉంది. దాంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ప్రభావితం చేసే ఈ అంశం మీద షర్మిల జిల్లా పర్యటనలు చేయబోతున్నారు ఒక విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాలను టచ్ చేస్తూ సాగే షర్మిల యాత్రకు ఎంతో కొంత ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో షర్మిల ఈసారి పట్టుదలగా జనంలోకి రానున్నారు అని అంటున్నారు. రాహుల్ గాంధీని రప్పించి మరీ ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుతాను అని కూడా చెప్పబోతున్నారు.

రాజ్యసభ ఆశలతో :

ఇక షర్మిల తన పార్టీని తెలంగాణాలో స్థాపించి మూడేళ్ళు అక్కడ పోరాడారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి మరీ ఏపీలో రాజకీయం మొదలెట్టారు. ఆమెకు ఆనాడు కాంగ్రెస్ పెద్దల నుంచి ఒక హామీ లభించింది అని ప్రచారం జరిగింది. అదేంటి అంటే రాజ్యసభకు ఆమెని నామినేట్ చేస్తామని. ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు రాజ్యసభకు సీట్లు ఖాళీ అయినా షర్మిల ఊసే లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది ఏకంగా 73 సీట్లు రాజ్యసభలో ఖాళీ అవుతున్నాయి. మరి ఇందులో కాంగ్రెస్ కి కొన్ని సీట్లు లభిస్తాయి. అందులో ఏమైనా ఒకటి షర్మిలకు అకామిడేట్ చేస్తారా అన్నది చర్చగా ఉంది.

టైట్ గా పొజిషన్ :

అయితే కాంగ్రెస్ పరిస్థితి చూస్తే రాజ్యసభలో 73 సీట్లు ఖాళీ అయినా ఆ పార్టీకి దక్కేది తక్కువే అని అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు ఉన్నాయి. 73 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపధ్యలో ఆ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీట్లు 25 ప్లస్ సీట్లకు పడిపోతుందని అంటున్నారు. పైగా పదవీ విరమణ చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె వంటి వారిని తిరిగి కొనసాగించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే షర్మిల ఆశలు అయితే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. కర్ణాటక, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ ఇలా మూడింట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏడు సీట్లు ఇక్కడ ఖాళీ అవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ కి అయిదు కచ్చితంగా వస్తాయి. మహారాష్ట్ర, తమిళనాడు అసోం వంటి చోట్ల కలుపుకుంటే ఒకటి రెండు దక్కితే దక్కాల్సి ఉంది. చూడాలి మరి కర్ణాటక కోటానా లేక తెలంగాణా కోటానా అన్నది చూస్తే షర్మిలకు సీటు అకామిడేట్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News