షర్మిలను చూసి వైవీ సుబ్బారెడ్డి భయపడుతున్నారా? వైవీ స్పందనపై కేడర్ అసంతృప్తి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని, అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు.;
తెలంగాణలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్ కి ఇచ్చారంటూ రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం అగాధంగా మారగా, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఇద్దరి మధ్య బంధాన్ని పూర్తిగా తెంచేసినట్లేనని అంటున్నారు. ఈ వ్యవహారంపై స్పందిన షర్మిల తన ఫోన్ ట్యాప్ అవుతున్న సమాచారం ముందే తెలుసనని, ఆ విషయం తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు వైవీ అంగీకరించకపోవచ్చని కూడా ఆమె అన్నారు. దీంతో షర్మిల చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ వైవీ స్పందించాల్సివచ్చింది. అయితే ఆయన నేరుగా షర్మిల విమర్శలను ఖండించకుండా, విషయాన్ని పచ్చ పేపర్లు అంటూ టీడీపీ అనుకూల మీడియాపై తోసివేయడం ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని, అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. కానీ వైవీ మాత్రం షర్మిల ఆరోపణలకు కౌంటర్ గా ఎక్స్ లో స్పందించారు. అయితే ఆ ట్వీట్ లో షర్మిల ఆరోపణలు ఎక్కడా ఖండించలేదు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని వైవీ తనకు చెప్పారని షర్మిల సూటిగా చెప్పినా, వైవీ మాత్రం ఆమె విమర్శలు జోలికి వెళ్లలేదు. షర్మిల ప్రస్తావించిన అంశాలను ఖండించలేదు. అదేసమయంలో పత్రికల్లో వచ్చిందని మాత్రం పేర్కొనడంపై వైసీపీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందో? లేదో? కూడా తనకు తెలియదని వైవీ ట్వీట్ చేశారు. ‘‘గత తెలంగాణ ప్రభుత్వం షర్మిలగారి ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండగా,షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు.అప్పుడు జగన్‌గారికి, షర్మిలగారికి సంబంధాలు ఇలా లేవు.అలాంటి పరిస్థితుల్లో షర్మిలగారి ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా?లేదా? అన్నది నాకు తెలియదు.టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీల్లో,పత్రికల్లో నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నాను.’’ అంటూ వైవీ చేసిన ట్వీట్ అత్యంత పేలవంగా ఉందని అంటున్నారు. షర్మిల ఆరోపణలను ఖండించడానికి వైవీ వెనక్కి తగ్గడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.