ముందు జగన్...వెనక వాహనాలలో కట్టలే కట్టలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైసీపీ పోరు చేపట్టింది. నాలుగు నెలల క్రితం పార్టీ అధినాయకత్వం దీని మీద పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ నేతలు క్యాడర్ కోటి సంతకాల సేకరణకు రంగంలోకి దిగారు.;

Update: 2025-12-07 06:41 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ లోక్ భవన్ లోకి మొదటి సారి అడుగు పెడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళిన వెంటనే. తాజాగా బాబు లోక్ భవన్ గా మారిన రాజ్ భవన్ లోకి వెళ్ళి వచ్చారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఆయన మర్యాదపూర్వకమైన భేటీ వేసి పలు అంశాలను చర్చించారు. ఇపుడు విపక్ష నేత జగన్ వంతు అన్నట్లుగా ఉంది. జగన్ కూడా గవర్నర్ ని కలవబోతున్నారు. ఈ మేరకు లోక్ భవన్ అధికార వర్గాలు గవర్నర్ తో అపాయిట్మెంట్ ని ఖరారు చేశారు.

17న నజీర్ తో మీట్ :

ఈ నెల 17న వైఎస్ జగన్ వైసీపీకి చెందిన ముఖ్య నేతలు అంతా కలసి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కి చూపించనున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో మొత్తంగా ఉన్న 26 జిల్లాల నుంచి సేకరించిన ఈ సంతకాలకు సంబంధించిన పత్రాలను గవర్నర్ కి చూపించందుకు భారీ ఎత్తున తరలించనున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రైవేట్ పై వైసీపీ పోరు :

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైసీపీ పోరు చేపట్టింది. నాలుగు నెలల క్రితం పార్టీ అధినాయకత్వం దీని మీద పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ నేతలు క్యాడర్ కోటి సంతకాల సేకరణకు రంగంలోకి దిగారు. ఇక మొత్తానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేసిన వైసీపీ దీనిని గవర్నర్ ముందుకు తీసుకుని వెళ్ళాలని చూస్తోంది. ఇక గవర్నర్ సైతం ప్రతిపక్ష నేతకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే గవర్నర్ తో భేటీకి ఎంత మంది పార్టీ నేతలు వెళ్తారు, ఎవరెవరు వారు ఉంటారు అన్నది కూడా చర్చగా ఉంది.

ఏమి మాట్లాడుతారు :

ఇక గవర్నర్ తో జగన్ భేటీ మీద ఆసక్తి ఏర్పడింది. ఇటీవల కాలంలో జగన్ గవర్నర్ ని కలవలేదు. దాంతో ఆయన భేటీలో ఏమేమి అంశాలు మాట్లాడుతారు అన్నది కూడా చర్చగా మారింది. కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీదనేనా లేక మరిన్ని ఇతర అంశాల మీద కూడా మాట్లాడుతారా అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కోటి సంతకాల కోసం చేపట్టిన కర్యక్రమం విజయవంతం అయింది అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఆకర్షించేలా :

ఇక కోటి సంతకాల ప్రతులు అంటే కట్టలు కట్టలుగా ఉంటాయి. దాంతో వీటిని ఎలా లోక్ భవన్ కి చేరుస్తారు అన్నది ఇక్కడ కీలక పాయింట్. ఒక వినతి పత్రం కాదు, అలాగే మరో చిన్న విషయం కాదు, పైగా వైసీపీ ప్రతిష్టగా తీసుకున్న తొలి కార్యక్రమంగా ఇది ఉంది. అందుకే ప్రత్యేక వాహనాల ద్వారా ఏపీ ప్రజల మొత్తం ఫోకస్ ని ఈ వైపుగా తిప్పుకునేందుకు ప్రత్యేక వాహనాలనే వైసీపీ రంగంలోకి తెస్తోంది అని అంటున్నారు. మరి దీని మీద గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారు. ఏ విధంగా వైసీపీ ఈ పోరాటానికి లాజికల్ ఎండ్ కార్డు వేస్తుంది అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ తన విపక్ష పాత్ర పోషణలో కోటి సంతకాల సేకరణ అన్నది ఒక కీలక అడుగుగా భావిస్తోంది. 2025 ఇయర్ ఎండింగ్ లో పొలిటికల్ గా వైసీపీకి ఇది బిగ్ బూస్ట్ ని ఇస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. మిగిలిన యాక్షన్ ప్లాన్ అంతా 2026 లో చూడండి అని పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. సో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News