తొలి వేలుపు కి మొక్కిన జగన్

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి వేలుపు అయిన గణపతికి మొక్కారు.;

Update: 2025-08-28 03:00 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి వేలుపు అయిన గణపతికి మొక్కారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో జగన్ సతీసమేతంగా పాల్గొనడం విశేషం. అర్చకులు చెప్పినట్లుగా అన్నీ చేస్తూ సంప్రదాయ పద్ధతిలో గణపతిని కొలిచారు. గతంలో ఈ విధంగా ఎపుడూ చేసినట్లు అయితే అంతగా లేదని చెబుతున్నారు. అంతవరకూ ఎందుకు గత ఏడాది పార్టీ ఓడి విపక్షంలోకి వచ్చిన తరువాత వచ్చిన వినాయక చవితి పండుగలో కూడా జగన్ పూజించింది లేదని అంటారు.

మారిన జగన్ :

జగన్ గతానికి భిన్నంగా నడచుకుంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నపుడు కానీ అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ పాటించని విధానాలు ఇపుడు పాటిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా జగన్ ఆధ్యాత్మిక భావనలను పెంచుకుంటున్నారని అంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఒక మతాన్ని అభిమానించి ఆరాధిస్తారు. అయితే ఆ మధ్యన ఆయనే చెప్పినట్లుగా బయటకు వస్తే ఇతర మతాలను పద్ధతులను తాను గౌరవిస్తిస్తున్నారు. ఇపుడు చూస్తే హిందువుల పండుగలలో సైతం ఆయన పాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే శుభాకాంక్షలు అన్ని ట్వీట్ వేసి ఊరుకునేవారు అని గుర్తు చేస్తున్నారు.

ఆ ముద్ర పోగొట్టుకోవడానికే :

ఏపీలో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. అవి జగన్ మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి అని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఏడాది తిరుమల లడ్డూ విషయంలో జరిగిన రాజకీయ యాగీ అంతా అందరూ చూశారు. పైగా హిందువులలో ఒక అనుమానాన్ని రగిలించే ప్రయత్నం చేశారని కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు ఆనాటి నుంచి జగన్ లోనూ మార్పు వచ్చిందని అంటున్నారు. అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న ఒక మతం వారి అభిప్రాయాలను గౌరవించడం అన్నది ఆచరణలో కూడా మరింతగా కనిపించాలని భావించే ఆయన ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు.

ఎక్కువగా వినిపిస్తున్న సనాతనం :

ఇక ఏపీ రాజకీయాలు ఒక వైపు సిద్ధాంతం పోరాటం సాగుతోంది అదే సమయంలో సనాతన ధర్మం గురించిన చర్చ కూడా సాగుతోంది. హిందూత్వ సనాతన ధర్మం అన్నవి బీజేపీ వారు ఎక్కువగా ప్రవచిస్తూంటారు. అయితే చిత్రంగా మిత్ర పక్షాల నోటి వెంట ఆ మాటలు వస్తున్నాయి. దాంతో ఏపీ పాలిటిక్స్ లో అనివార్యంగా వీటి మీద కూడా చర్చ సాగుతోంది. దాంతో పాటు భక్తి పరమైన అంశాలు కూడా ఎక్కువగా ఆలోచింపచేసేలా ముందుకు వస్తున్నాయి.

అందరి వాడిగా ఉండేందుకు :

ఈ కీలక సమయంలో తాను అందరి వాడిని అన్న విధంగా ఉండేందుకు జగన్ సైతం హిందూ దేవతల పండుగలలో పాలు పంచుకుంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నపుడు ఉగాది పండుగ వేడుకలను తన అధికార నివాసంలో జరిపించేవారు. అయితే ఇపుడు విపక్షంలో ఉంటూ వినాయకచవితి నుంచి మొదలుపెట్తారని అంటున్నారు. నిజానికి విజయవాడ రాణి గారి తోటలో జరిగే వినాయచవితి ఉత్సవాలలో జగన్ పాల్గొనాల్సి ఉంది. భారీ వర్షాల నేపధ్యంలో ఆయన పార్టీ ఆఫీసులో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నారు. రానున్న రోజులలో ఆయన ఇదే రకమైన ధోరణితో ముందుకు సాగుతారా అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి మరి.

Tags:    

Similar News