అటు బెంగళూర్ ఇటు లోటస్ పాండ్ ...వ్యవహారం కొలిక్కి ?

అందుకే గత నెల 21న జరిగిన జగన్ బర్త్ డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేసారు అని అంటున్నారు.;

Update: 2026-01-08 05:00 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేసే పనిని ఒక వైపు చేస్తూ వస్తున్నారు. మరో వైపు తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విషయంలో దృష్టి పెట్టారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. వైఎస్ జగన్ జగన్ సొంతింట అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఏకంగా సొంత పార్టీనే వైఎస్ షర్మిల పెట్టారు. తెలంగాణాలో మూడేళ్ళ పాటు పార్టీని నడిపారు. అంతే కాదు పాదయాత్ర కూడా చేశారు. ఎంతో వ్యయప్రయాసలను పడ్డారు. ఆ తర్వాత ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె వైసీపీ మీదనే తన గురిని ఎక్కుపెట్టారు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి. షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు. అలాగే షర్మిల కూడా రాజకీయంగా అనుకున్నది అయితే సాధించలేకపోయారు అని అంటున్నారు.

వారే సారధులుగా :

వైఎస్సార్ ని అభిమానించే వారు, వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అయిన వారు అయితే ఈ విధంగా అన్నా చెల్లెలు విడిపోయి రాజకీయంగా కలహించుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. అటు బెంగళూర్ ఇటు లోటస్ పాండ్ లకు వైఎస్సార్ సన్నిహితులు తిరిగి మరీ అన్నా చెల్లేళ్ల మధ్య ఒక రాజీని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కలసి ఉంటేనే మేలు అన్నది కూడా వారు చెబుతున్నారని టాక్. ఒక వేళ కలసి లేకపోయినా కలహించుకోవద్దని దాని వల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కూడా హితవు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

బర్త్ డే గ్రీట్ తో :

అందుకే గత నెల 21న జరిగిన జగన్ బర్త్ డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేసారు అని అంటున్నారు. దానికి బదులు ఇస్తూ షర్మిలమ్మా అని జగన్ పూర్వం మాదిరిగా ఆప్యాయానురాగాలను చూపించారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు జగన్ మేనల్లుడు అయిన రాజారెడ్డి వచ్చి సందడి చేశారు అని అంటున్నారు. మొత్తానికి అయితే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది అని చెబుతున్నారు.

అదే జరగాలంటూ :

ఇక వైసీపీ సీనియర్ నేతలు అంతా అదే కోరుకుంటున్నారు అని చెబుతున్నారు. కొన్నాళ్ళ క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళూ కలవవచ్చేమో అని కూడా మాట్లాడారు, ఇక ఆఫ్ ది రికార్డుగా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ జిల్లాల పర్యటనలు ఆ మీదట పాదయాత్ర ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటి కంటే ముందు ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల అనుభవాలు పునరావృత్తం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అధినాయకత్వం భావిస్తోంది అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News