జగన్ జంఝాఠం: నాడు పాలనతో.. నేడు మాటలతో..!
తాజాగా ఐపీఎస్, ఐఏఎస్ అదికారులను వాడు-వీడు అంటూ వ్యాఖ్యానించడం పట్ల బీసీ సామాజిక వర్గాలు రగులుతున్నాయి.;
వైసీపీ అధినేత జగన్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు.. పాలన పరంగా ఆయన పై వ్యతిరేకత పెరిగిపోయింది. దీనికి కారణం.. ఆయన స్వయం కృతమే. క్షేత్రస్థాయిలో నాయకులను కట్టడి చేయకపోవడం ఒక ఎత్తయితే.. మరోవైపు దూకుడుగా ముందుకు వెళ్లిన నాయకులను కట్టడిచేసే విషయంలో ఆయన వ్యవహరించిన ఉదాశీన వైఖరి.. నాటి ఐదేళ్ల పాలనలో జగన్‌కు మచ్చలు పడేలా చేశారు. సాధారణంగా.. దీనిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
ఇక, ఇప్పుడు తన మాటల ద్వారా మరోసారి మైనస్ అవుతున్నాయి. వాస్తవానికి విపక్షంలో ఉన్న నాయకు లు చేసే వ్యాఖ్యలు ఆలోచనాత్మకగా ప్రజలు హర్షించేలా.. తమ సమస్యలు ప్రస్తావించారన్న సంతృప్తి పెరిగేలా ఉండాలి. గతంలో చంద్రబాబు ప్రజల పక్షాన మాట్లాడిన ప్రతిమాటా.. ప్రజలను కదిలించింది. మన కోసమే చంద్రబాబు ఉన్నారన్న వాదనను బలపడేలా చేసింది. తద్వారా.. ఆయనకు సింపతీ పెరిగేలా కూడా చేసింది.
ఇలాంటి తరహా రాజకీయాలు జగన్‌కు చేతకావడం లేదో.. లేక తను పట్టుకున్న రాజకీయాలు ఇలానే ఉండాలని అనుకున్నారో.. తెలియదు కానీ.. అటు పాలన పరంగా ఆయన ఎన్ని చేసినా.. గడప దాటి బయటకు రాకపోవడం, నాయకులను లైన్‌లో పెట్టకపోవడం.. బూతులు, వివాదాస్పద నాయకులను ప్రోత్సహించడం ద్వారా ఆనాడు మైనస్ అయితే.. ఇప్పుడు స్వయంగా తన నోటి మాట కారణంగా మరింత చేటు తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఐపీఎస్, ఐఏఎస్ అదికారులను వాడు-వీడు అంటూ వ్యాఖ్యానించడం పట్ల బీసీ సామాజిక వర్గాలు రగులుతున్నాయి. ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టాయి. తద్వారా బీసీ సామాజిక వర్గంలో మరింత మైనస్ అయ్యేందుకు జగన్ స్వయంగా అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇది ఏమేరకు ఆయనకు మంచి చేస్తుందన్నది చూడాలి. ఇదిలావుంటే.. ఏ పార్టీఅయినా.. రాను రాను పుంజుకునే దిశగా అడుగులు వేస్తుంది. కానీ, వైసీపీ మాత్రం జారుడు బండపై చేస్తున్న విన్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.