జగన్ రెడీ...జూలై తొమ్మిదిన ఏం జరుగుతుంది ?
జగన్ పర్యటనలో పాల్గొంటే ఏకంగా క్రిమినల్ కేసులే పెడతామని పోలీసులు మామిడి రైతులను వైసీపీ నేతలను హెచ్చరిస్తునారని భూమన చెప్పారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన చాలా రోజుల క్రితమే ఖరారు అయింది. అయితే తాజాగా చూస్తే కనుక జగన్ టూర్ కి అనుమతులను పోలీసులు ఇవ్వలేదు. కరెక్ట్ గా పదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనమయ్య జిల్లాలో ఉందని అందువల్ల పోలీసు బందోబస్తుని ఇవ్వలేనమి 10 తరువాత మరో రోజు చూసుకుంటే చూస్తామని అన్నారు.
దాంతో వైసీపీ నేతలు ఏమాలోచించుకున్నరో తెలియదు కానీ జగన్ టూర్ తప్పకుండా జరిగి తీరుతుందని అది తొమ్మిదినే ఉంటుందని అంటున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇదే విషయం మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అన్ని రకాలుగా అన్యాయం అయిపోయిన మామిడి రైతులను జగన్ ప్రతిపక్ష నేత హోదాలో పరామర్శిస్తానని అంటే అడ్డు పెట్టడమేంటని అంటున్నారు.
జగన్ పర్యటనలో పాల్గొంటే ఏకంగా క్రిమినల్ కేసులే పెడతామని పోలీసులు మామిడి రైతులను వైసీపీ నేతలను హెచ్చరిస్తునారని భూమన చెప్పారు. అయినా సరే జగన్ పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తొమ్మిదిన జగన్ బంగారుపాళెం వస్తున్నారని అనుమతులు ఇచ్చినా లేకపోయినా టూర్ ఖాయమని అన్నారు.
దీంతో ఇపుడు అందరి చూపూ జూలై తొమ్మిది మీద పడుతోంది. ఆ రోజున ఏమి జరుగుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. జగన్ అయితే పర్యటనకు సిద్ధపడుతున్నట్లుగా సీనియర్ నేతలు సంకేతాలు ఇచ్చేశారు. కావాలనే జగన్ టూర్లను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు భావించడం వల్లనే ఎక్కడా తగ్గకూడని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
అయితే పోలీసులు అనుమతి ఇవ్వకుండా టూర్లు చేస్తే జగన్ తో పాటు అందరి మీద కేసులు పెడతారా అన్నది ఒక చర్చగా ఉంటే అసలు ఆ రోజున జగన్ పర్యటనకు ముందే అరెస్ట్ చేస్తారా అన్నది మరో చర్చ. అంతే కాదు వైసీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేసి ఇళ్ళలో ఉంచుతారా అన్నది కూడా చర్చగా ఉంది.
మొత్తం మీద చూస్తే కనుక జగన్ టూర్లు అన్నీ రాజకీయంగా రచ్చ అవుతున్నాయి. పెను వివాదాలకు దారి తీస్తున్నాయి. అయితే కావాలని ప్రభుత్వమే రెచ్చగొడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తూంటే అనుమతులు తీసుకోకుండా ఎవరు చట్టాన్ని ఉల్లఘించినా చర్యలు తప్పవని కూటమి నేతలు అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక జగన్ పర్యటన విషయం కచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలతో పోలీసులు సైతం అలెర్ట్ అవుతున్నారు. దాంతో ఉమ్మడి చిత్తూరు బంగారుపాలెం వైపే జూలై 9న మీడియా అటెన్షన్ అంతా పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.